కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో సారి రెచ్చిపోయారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
దీంతో ఒక్కసారిగా రాజకీయా వాతావరణం వేడిక్కింది.మహానాడు జరుగుతున్న సమయంలో ముద్రగడ చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి.
‘నీకు పిల్లనిచ్చి వివాహం జరిపించిన ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించావ్.ఇప్పుడేమో ఓట్ల కోసం చెప్పులు విడిచి ఆయన విగ్రహానికి ఒంగి ఒంగి దొంగ నమస్కారాలు పెడుతున్నావ్’ అంటూ సీఎం చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు.సోమవారం ఆయన సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.హామీలను నెరవేర్చాలని అడిగితే.కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వకాలు, ఆస్తుల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఈమేరకు చంద్రబాబు ప్రధానిని కోరాలంటూ ముద్రగడ డిమాండ్ చేశారు.
తరచూ బాబు నిప్పు అని చెప్పుకుంటున్నారు, ఒకవేళ అదే నిజమైతే దర్యాప్తు ముందు నిలబడాలని ఆయన అన్నారు.తనను ఎదిరించే వారిని అదే కులస్తులతో తిట్టించే దురలవాటు ముఖ్యమంత్రికి ఉందని విమర్శించారు.
బాబును ఏదో జబ్బు వేధిస్తోందని, దాని కారణంగానే ఇలాంటి దురలవాటు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.భారతదేశంలో చంద్రబాబు రోగానికి మందు లేదని, అందుచేత జబ్బు బాగా ముదిరిపోయిందని ముద్రగడ ఎద్దేవా చేశారు.
లోకేష్ మంత్రి పదవి కోసం ఓ పూజారిని సంప్రదించారని, కానీ పూజారి అడిగిన ప్రశ్నకు ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు సమాధానం ఇవ్వలేదని నిలదీశారు.ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ .నాలుగేళ్లుగా డప్పు కొట్టి.ఇప్పుడేమో హఠాత్తుగా ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
గతంలో బీజేపీతో కాపురం పెద్ద తప్పిదమన్న చంద్రబాబు.మళ్లీ వాళ్ల కాళ్లు పట్టుకొని నాలుగేళ్ల పాటు కాపురం చేసి అందినకాడికి దోచుకున్నారని దుయ్యబట్టారు.
ఎప్పటికప్పుడు యూ టర్న్‌లు తీసుకుంటూ.తనను కాపాడాలని ప్రజల్ని వేడుకోవడం కూడా చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఈమధ్య చంద్రబాబు ఎడాపెడా నీతులు వల్లె వేస్తున్నారని.మరి కాపు జాతిపై పెట్టిన తప్పుడు కేసుల మాట ఏమిటని ప్రశ్నించారు.
వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.