ఉపాధి కోసం కెనడాకు వలస వెళ్లిన భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.నోవా స్కాటియాలోని ట్రూరో నగరంలో నివసిస్తున్న మృతుడిని అపార్ట్‌మెంట్‌లోనే కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా చావకొట్టి పారిపోయారు.
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న అతనిని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో వున్న అతనిని ఆస్పత్రికి తరలించారు.
అయితే అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ట్రూరో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడిని పంజాబ్ రాష్ట్రం మొగాకు చెందిన 23 ఏళ్ల ప్రభజోత్ సింగ్ కత్రిగా గుర్తించారు.అతను లేటన్స్ ట్యాక్సీతో పాటు ట్రూరోలోని రెండు మూడు రెస్టారెంట్స్‌లో పనిచేస్తున్నాడు.
తన తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో కుటుంబం కోసం అతను 2017లో కెనడాకు వలస వచ్చాడు.ఇక్కడ సంపాదించిన డబ్బును భారత్‌లోని తల్లికి పంపుతున్నాడు.ఇప్పుడిప్పుడే పరిస్ధితి చక్కబడుతున్న వేళ.ప్రభజోత్ మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న ఆ తల్లి .కొడుకు కూడా లేడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
ట్రూరో పోలీస్ అధికారి డేవిడ్ మాక్ నీల్ మాట్లాడుతూ.ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తమకు 911 ద్వారా నగర పరిధిలోని 494 రాబీ స్ట్రీట్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు.
దాంతో హూటాహూటిన ఘటనాస్థలికి చేరుకున్న తాము ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉండడం చూసి వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు.కానీ అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు మాక్ నీల్ తెలిపారు.
దీనిని నరహత్యగానే తాము భావిస్తున్నామని దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ చీఫ్ వెల్లడించారు.

మరోవైపు ప్రభజోత్ సింగ్ హత్యపై కెనడాలోని భారతీయ కమ్యూనిటీ భగ్గుమంది.ఇది నరహత్య కాదని.కచ్చితంగా జాత్యాహంకార దాడి అని ఆరోపించారు.
విద్వేషపూరితంగానే కొందరు దుండగులు దాడి చేసి ప్రభజోత్‌ను చంపేశారని ఇండియన్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభజోత్ సింగ్ కత్రి చాలా మంచివాడని, వివాదాల్లో తలదూర్చకుండా తన పని తాను చూసుకునేవాడని అతని స్నేహితులు వెల్లడించారు.
అందరీతో ఎంతో సరదాగా ఉండే తమ మిత్రుడు ఇలా దారుణ హత్యకు గురికావడం పట్ల వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.మరోవైపు ప్రభజోత్ సింగ్ మృతదేహాన్ని భారత్‌లోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ‘గోఫండ్‌మీ’ ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు కెనడాలోని భారతీయ సమాజం వెల్లడించింది.