ఎన్నో కష్టాలు, ఎంతోమంది శ్రమ, చాలాకాలం నిరీక్షణ తరవాత ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.పార్టీ అధికారంలోకి రావడంతో పాటు తాము కూడా బంపర్ మెజార్టీతో గెలవడంతో వైసీపీలోని 151 మంది ఎమ్యెల్యేల్లో ఎక్కడలేని ఆనందం వెల్లువిరిసింది.
ఇప్పటివరకు పార్టీ కోసం, తమ గెలుపు కోసం ఆర్ధికరంగా ఎన్నో ఇబ్బందులు పడిన ఎమ్యెల్యేలంతా హమ్మయ్య అంటూ సేదతీరారు.ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ మ్యానిఫెస్టో తో పాటు, నియోజకవర్గ సమస్యల మీద ఎన్నో హామీలు ప్రజలకు ఇచ్చి గెలిచారు వైసీపీ ఎమ్యెల్యేలు.
వంతెనల నిర్మాణం నుంచి మొదలుకుని పాఠశాలలు, రహదారులు, బిల్డింగులు ఇలా తమ నోటికి వచ్చిన ప్రతి హామీని వారు ఇచ్చారు.ఇప్పుడు ఆ హామీలను అమలు చేసి తాము కూడా కొంత లాభపడుదామని చూస్తున్న వైసీపీ ఎమ్యెల్యేలకు పరిస్థితులు అనుకూలంగా కనిపించడంలేదు.
జగన్ ప్రస్తుతానికి నవరత్నాల పథకాల మీదే దృష్టిపెట్టి వాటికే నిధుల కేటాయింపు చేసే పనిలో నిమగ్నం అయ్యాడు తప్ప మిగతా ఏ విషయాల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించడంలేదు.
దీని కారణంగా ఇప్పటి వరకుఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ఎక్కడా అభివృద్ది కార్యక్రమాలు ఏవీ పెద్దగా జరగలేదు.
దీనికి కారణం ఏ పని చేయాలన్నానిధులు కావాల్సి రావడమే.అయితే ప్రస్తుతానికి అటువంటి కేటాయింపులు ఏవీ ఎమ్మెల్యేలకు లేకపోవడంతో ఇటు ప్రజల నుంచి ఆరోపణలు, మరోపక్క ప్రతి పక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోంది.
ఇలా అని ప్రభుత్వం నుంచి నిధులు ఎలా అయినా తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నా ఎక్కడా ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి ఎమ్యెల్యేలకు లేకుండా పోయింది.దీంతో ప్రజల దగ్గరకు ధైర్యంగా వెళ్లలేని పరిస్థితుల్లో వైసీపీ ఎమ్యెల్యేల్యేలు ఉండిపోతున్నారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి తొలి ఆరు నెలల్లో కేవలం సంస్కరణల మీదే ఎక్కువుగా దృష్టిసారించారు.పరిపాలనలో మార్పులు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, మద్యం పాలసీతో పాటు అమ్మ ఒడి అమలు ఇలా అనేక పథకాలపై దృష్టి సారిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో నిధుల కోసం ధైర్యం చేసి నేరుగా సీఎం జగన్ ను అడుగుదామంటే అంత అవకాశం వారికి దక్కడంలేదు.పోనీ ఇంచార్జి మంత్రులకు తమ బాధ చెప్పుకున్నా నిధుల విషయంలో ప్రస్తుతానికి తామేమి చేయలేమంటూ వారు చేతులు ఎత్తేస్తున్నారు.దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.కాస్త పలుకుబడి ఉన్నఎమ్మెల్యేలు మాత్రం నేరుగా సీఎం జగన్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కొద్దో గొప్పో నిధులు పొందేందుకు హామీ సంపాదిస్తున్నారు.కానీ, సాధారణంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆ అవకాశం దక్కడంలేదట.పోనీ ఈ విషయంలో లైట్ తీసుకుందామా అంటే నియోజకవర్గంలో ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి నెలకొనడంతో వీరు సతమతం అయిపోతున్నారు.ఇక అసెంబ్లీ లో ప్రతి ఎమ్యెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం కోటి రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
దీంతో నియోజకవర్గంలో చిన్నా చితకా పనులు చేయించవచ్చని ఎమ్యెల్యేలు ఆశపడ్డారు.ఇదే విషయంపై మంత్రి వర్గ భేటీలోనూ చర్చ జరిగింది.
అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో వైసీపీ ఎమ్యెల్యేలంతా కక్కలేక మింగలేక అన్నట్టుగా నిధుల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది.