సాదరణం గా ఎన్నికల నగారా మోగగానే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ పద్ధతుల్లో ప్రయత్నిస్తూ ఉంటాయి.అధికార పక్షం అయితే తాము చేసిన అభివృద్ధిని వివరించడంతోపాటు భవిష్యత్తు గురించి హామీలను ఇస్తూ ఉంటాయి.
ప్రతిపక్షాలు అయితే పాలకపక్ష పరిపాలనలోని వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ తామోస్తే వాటిని ఎలా సరిదిద్దుతామో, కొత్త పథకాలు ఎలా తీసుకొస్తామో ప్రజలకు వివరించి వారి ఆదరణ పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎన్నికల ప్రచారాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్తుంది .
ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం( Gadapa Gadapa Ku Mana Prabutvam ), జగనన్న సురక్ష ,వై నాట్ 175 కార్యక్రమాలతో గ్రామస్థాయిలను ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆ పార్టీ , ఇప్పుడు కొత్తగా వై ఏపీ నీడ్స్ జగన్? ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలనే పేరుతో భారీ ఎత్తున మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.సామాజిక సాధికారక బస్సు యాత్ర( YCP Bus Yatra ) పేరుతో ఇప్పటికే ఆ పార్టీ స్థానిక నాయకులు బస్సు యాత్రలు నిర్వహిస్తూ ఉండగా ఇప్పుడు దానికి అదనంగా ప్రభుత్వ ప్రజలకు చేస్తున్న మంచిని ఇంటింటికి తిరిగి వివరించడానికి మరో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. సంక్షేమ పథకాలు 90 శాతానికి పైగా ప్రజలకు ఇప్పటికే అమలు అవుతున్నాయని తాము ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశామని ,ప్రతి ఇంటికి తమ సంక్షేమ కార్యక్రమాల వల్ల జరిగిన లబ్ధిని ఒక బుక్ లెట్ రూపంలో ప్రింట్ చేసి మరీ అందిస్తూ నయా ప్రచారానికి వైసిపి శ్రీకారం చుట్టింది.
ప్రతి కుటుంబానికి జరిగిన లబ్దిని అంకెలతో సహా వివరిస్తూ స్థానిక వైసీపీ నాయకులు మరియు అధికారుల కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇది పూర్తిస్థాయి అనధికారిక ఎన్నికల ప్రచారంగా నిర్వహించాలని వైసీపీ అధిష్టానం భావించినట్లుగా కనిపిస్తుంది .అందుకే ఎక్కడా అలసత్వం లేకుండా పూర్తిస్థాయి పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( CM Jagan )తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.అంతేకాకుండా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా నాయకులు అధికారులతో సమన్వయం చేసుకొని ఎటువంటి అలసత్వం వహించకుండా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇంకా ప్రతిపక్షాలు పుంజుకునే స్థాయిలోనే ఉండటం, సమన్వయ సమావేశాలు మేనిఫెస్టో రూపకల్పనలో ఉండడంతో వారికి అందనంత వేగం గా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది.మరి అధికార పార్టీ వేగాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు అందుకుంటాయో చూడాలి.