మొదటినుంచి వివాదాస్పద నాయకుడిగా వైసిపి నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తాను మాత్రం తన పద్ధతి మార్చుకోను అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తుండడం అనేక వివాదాలకు కారణమవుతోంది.
మహిళా ఎంపీడీవో పై దౌర్జన్యం చేసిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.మహిళా ఎంపీడీవో సరళ ఇంటికి పెళ్లి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కోసం బెదిరించారని, దౌర్జన్యం చేశారని అభియోగాలు రావడంతో ఆయన అరెస్టయ్యారు.
అయితే ఈ విషయంపై కోటంరెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు.ఎంపీడీవో తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, తాను ఎవరినీ బెదిరించలేదు, ఎటువంటి తప్పు చేయలేదన్నారు.
ఇదే విషయమై ఎంపీడీవో సరళ స్పందిస్తూ గొలగమూడి దగ్గర ఉన్న ఓ లే అవుట్ కు వాటర్ కనెక్షన్ మంజూరు చేయలేదన్న కోపంతో ఎమ్మెల్యే తనను దుర్భాషలాడటం తో పాటు తన ఇంటి విద్యుత్, కేబుల్ కనెక్షన్లు తొలగించడంతో పాటు వాటర్ పైప్ లైన్లను తొలగించేందుకు గుంతలు తవ్వించారని ఆమె ఆరోపించారు.దీనిపై ముందుగా తాను పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఎవరు స్పందించలేదన్నారు.
అయితే ఈ వ్యవహారంపై జగన్ సీరియస్ అవ్వడంతో ఎట్టకేలకు ఆయనపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపుతోంది.నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శలు చేశారు.ఇది రాజకీయంగా మరింత చిక్కులు పెట్టే అంశంగా మారడంతో జగన్ ముందుగానే అలర్ట్ అయ్యి మరిన్ని విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు.
లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా ఎమ్మార్వో పై అప్పటి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేయడంతో టిడిపి చిక్కుల్లో పడింది.రాజకీయంగాను టీడీపీకి ఆ వ్యవహారం మాయని మచ్చలా తయారైంది.
కానీ జగన్ వేగంగా స్పందించి తన సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు.కాకపోతే ఈ వ్యవహారంపై విచారణ చేసి తప్పని తేలితే పార్టీ నుంచి తనను బహిష్కరించమని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సవాలును జగన్ స్వీకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.