సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఎవరికి మాత్రం అనిపించదు? ఎందరో ఈ పరిశ్రమలోకి రావాలనుకుని వచ్చి మధ్యలో అవస్థలు పడి వెనుతిరిగిన వారు ఎందరో ఉన్నారు.కానీ ఇందుకు కొందరు మినహాయింపు అని చెప్పుకోవచ్చు.
ఒకప్పుడు సినిమా హీరోలను దగ్గర నుంచి చూసి ఫోటోలు దిగాలి అనుకునే యువకుడుఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ ను తన క్లయింట్స్ గా మార్చుకునే స్థాయికి చేరాడు.ఇంతకీ తను ఎవరు? ఏం చేసి బాలీవుడ్ తారలను తన క్లయింట్స్ గా మార్చుకున్నాడు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జమీల్ షా.బీహార్‌కు చెందిన యువకుడు.నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు.బాలీవుడ్ హీరోలను చూడాలని ముంబైకి వచ్చాడు.
ఆ తర్వాత షూ తయారీ ప్రారంభించాడు.ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖుల కోసం డ్యాన్స్ షూస్ డిజైన్ చేస్తున్న ప్రముఖ షూ మేకర్ గా ఎదిగాడు.
ప్రస్తుతం బాలీవుడ్ అతడి షూస్ తో డ్యాన్స్ చేస్తుంది.ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.ముంబైకి రాక ముందు ఢిల్లీలో కూలీగా పని చేశాడు.ముంబై వెళ్లాలనే లక్ష్యంతో ఒకరోజు రైలు ఎక్కాడు.అక్కడ బతకడానికి చిన్నపాటి ఉద్యోగాలు చేశాడు.బాలీవుడ్ తారలను కలవాలనే కోరికతోనే ముంబైలో ఏదో ఒక పని చేసేవాడు.
హీరోల దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించిన అతడి స్నేహితుడు 25 వేల రూపాయలు కాజేశాడు.ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా జమీల్ నిరుత్సాహపడలేదు.
బాలీవుడ్ స్టార్స్ ను కలవడంతో పాటు వారితో డ్యాన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.ధారావిలోని లెదర్ యాక్సెసరీస్ తయారీ యూనిట్‌లో పని చేయడం మొదలు పెట్టాడు.

లాటిన్, ఇటాలియన్ డ్యాన్స్ క్లాసులు నిర్వహించే కొరియోగ్రాఫర్ సందీప్ సోపార్కర్ పోస్టర్ చూశాడు జమీల్.ఈ పోస్టర్‌లో వివిధ డ్యాన్స్ స్టైల్స్ చూసిన జమీల్ వాటికి అట్రాక్ట్ అయ్యాడు.తను కూడబెట్టుకున్న డబ్బుతో సందీప్ డ్యాన్స్ స్కూల్‌లో చేరాడు.కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్న జమీల్, రియాలిటీ షోలలో కూడా డ్యాన్స్ చేశాడు.అప్పటికే లెదర్ షూస్ తయారీలో పట్టు సాధించిన జమీల్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం షూస్ తయారు చేసుకున్నాడు.ఒకరోజు సందీప్ జమీల్‌కు కాల్ చేసి కొన్ని బూట్లు తీసుకొని రమ్మని చెప్పాడు.

అక్కడికి వెళ్లి చూసే సరికి కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, కాజోల్, అమీషా పటేల్, సోనాలి బింద్రే కనిపించారు.డ్యాన్స్ షూస్ చేసే వ్యక్తిగా జమీల్‌ను వారికి పరిచయం చేశాడు సందీప్.అతడు రూపొందించిన షూస్ వారందరికీ నచ్చాయి.కొద్ది కాలంలోనే జమీల్ పేరు బాలీవుడ్‌లో అందరికీ తెలిసింది.ఇప్పుడు అతడికి బాలీవుడ్ ప్రముఖుల నుంచి కస్టమ్ మేడ్ షూస్ డిజైన్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి.కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో జమీల్ గుర్తింపు పొందాడు.