తెలుగు సినిమా ప్రారంభ దశలో మొదటి తరం హీరోలు నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు ల తర్వాత మొదలైన రెండవతరం హీరోలలో కృష్ణ, శోభన్ బాబు ల తరువాత కెరీర్ స్టార్ట్ చేసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి.అయితే రెబల్ స్టార్ కెరీర్ చాలా విచిత్రంగా సాగింది అని చెప్పాలి.
మొదట హీరోగా చేసి మళ్ళీ విలన్ గా ప్రయోగాలు మొదలు పెట్టి ఇక కుదరక మళ్ళీ హీరోగా స్థిరపడి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి రెబల్ స్టార్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.కృష్ణం రాజు సినిమా కెరీర్ “చిలకా గోరింకా”
అనే సినిమాతో మొదలు పెట్టాడు.అలా కృష్ణంరాజు 60 చిత్రాలను పూర్తి చేసుకున్నారు.అప్పటి మాజీ మంత్రి మరియు నిర్మాత అయిన హరిరామ జోగయ్య కృష్ణం రాజు మరియు శోభన్ బాబు లను హీరోలుగా పెట్టి ‘బంగారు తల్లి’ అనే సినిమాను నిర్మించాడు.
ఈ సినిమా నుండి నిర్మాత జోగయ్య మరియు కృష్ణం రాజు మంచి మిత్రులుగా మారిపోయారు.మరో నిర్మాత అయిన చలసాని గోపి హరిరామ జోగయ్యకు సన్నిహితుడు కావడం విశేషం.
అయితే వీరిద్దరూ అప్పటికే ఆర్ధికంగా బాగా చితికిపోయి ఉన్నారు.అయితే ఫ్రెండ్ ఇలా ఉండడం కృష్ణం రాజు చూస్తూ ఉండలేకపోయాడు.
ఎలా అయినా ఒక సినిమాను వీరితో తీయాలని నిర్ణయించుకున్నాడు.కానీ మంచి కథ కోసం అంతా అన్వేషిస్తున్నారు.
అప్పుడే వీరికి కన్నడలో అప్పటికే విడుదలయి సంచలన విజయాన్ని సాధించిన శరపంజర అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నిర్ణయించుకున్నారు.ఆ విధంగా కృష్ణవేణి అనే పేరుతో కృష్ణం రాజు, వాణిశ్రీ లు హీరో హీరోయిన్ లుగా హరిరామ జోగయ్య మరియు చలసాని నిర్మాతలుగా మధుసూదన రావు డైరెక్టర్ గా ఈ సినిమా 1974 లో రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమాను మొదట బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించాలి అనుకున్నారట నిర్మాతలు.అయితే కృష్ణం రాజు ఇంత మంచి సబ్జెక్ట్ ను కలర్ లో తీస్తే బాగుటుంది అని వారితో చెప్పాడట.కానీ కలర్ లో తీసెంత ఆర్థిక స్థోమత మా దగ్గర లేదని ఇద్దరూ చేతులెత్తేశారట.ఇక చేసేది ఏమీ లేక కృష్ణం రాజు స్వయంగా గోపి కృష్ణ మూవీ అని ఒక బ్యానర్ ను స్థాపించి వారిద్దరికన్నా మేజర్ షేర్ తానే పెట్టుకుని కలర్ లో షూటింగ్ చేశారు.
అయితే ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు టాలీవుడ్ లో అందరూ ఎవరైనా ఇలాంటి సబ్జెక్ట్ ను తీసి ప్రయోగం చేస్తారా? ఈ దెబ్బతో కృష్ణం రాజు పని గోవిందా అంటూ లెక్కలు వేసుకున్నారట.కానీ కృష్ణం రాజు మాత్రం కథపై ఉన్న నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఫినిష్ చేశారు.
అయితే సినిమా పూర్తయిన తరువాత మొదటి కాపీని ఎన్టీఆర్ కు చూపించారట కృష్ణం రాజు.అది చూసిన ఎన్టీఆర్ బ్రదర్ అద్భుతంగా ఉంది ఇలాంటి సబ్జెక్ట్ ను తీయాలంటే ఎంతో దైర్యం ఉండాలి అని భుజం తట్టి పంపాడట.
అలా రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.ముఖ్యంగా ఈ సినిమాలో వాణిశ్రీ నటనకు మంత్రముగ్ధులయ్యారు ప్రేక్షకులు.
ఇది 100 రోజులను పూర్తి చేసుకుని సెలబ్రేషన్ కూడా హైదరాబాద్ లోని వేంకటేశ థియేటర్ లో చేయాలని అనుకున్నారు.అయితే ఈ సినిమా కు వెన్ను తట్టి ప్రోత్సహించిన ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా పిలవాలని అందరూ అనుకున్నారు.
అయితే కృష్ణం రాజు ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను పిలవడానికి ఇంటికి వెళ్ళారు.కానీ అక్కడున్న పుండరీకంక్ష్యయ్య మాట్లాడుతూ ఆరోజు ఎన్టీఆర్ కు తాతమ్మకల సినిమా షూటింగ్ ఉంది, అది కూడా బానుమతి గారి డేట్స్ దొరకడం లేదు అంటూ చెప్పారు.ఈ మాట వినగానే కృష్ణం రాజు బాధ పడ్డాడు.అయినా వచ్చాము కదా ఒకసారి ఆశీర్వాదం తీసుకుందాం అని వెయిట్ చేశాడు.ఇక కొద్ది సేపటికి ఎన్టీఆర్ వచ్చి విషయం తెలుసుకుని సారీ బ్రదర్ ఆ రోజు నాకు షూటింగ్ ఉంది అని చెబుతూనే ఒకసారి సాయంత్రం కాల్ చేయమని చెప్పాడు ఎన్టీఆర్.ఈ రోజు ఫోన్ చేయడం ఎందుకని సరాసరి ఇంటికెళ్లాడు.
అయితే వెళ్ళగానే అక్కడున్న పుండరీకంక్షయ్య నీ లక్ బాగుందయ్యా… ఎన్టీఆర్ మీ ఫంక్షన్ కు వస్తున్నారు అన్నాడు.ఇక ఈ మాటతో కృష్ణం రాజు ఆనందానికి అవధులు లేవు.
అలా ఎన్టీఆర్ మరియు సతీమణి ఇద్దరూ కలిసి వచ్చి ఫంక్షన్ ను జయప్రదం చేశారు…
.