తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి నుంచి ఇంకా బీజేపీ కోలుకోలేదు.ఓటమికి గల కారణాలపై ఇంకా పార్టీలో రచ్చ రచ్చ జరుగుతుంది.
తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనే అంచనా తో బిజెపి ముందు నుంచి ధీమాగానే ఉంది.దీనికి తగ్గట్లుగానే నాయకులు బాగానే కష్టపడ్డారు.అయితే ఫలితాలు మాత్రం తేడా కొట్టాయి.111 స్థానాల్లో బిజెపి అభ్యర్థులను పోటీకి దంచగా, కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం దక్కింది.దీంతో మిగతా నియోజకవర్గల్లో పార్టీ ఓటమికి గల కారణాలేమిటి అనేది తెలుసుకునేందుకు బిజెపి రాష్ట్ర నాయకత్వం నడుం బిగించింది.ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీ ఓటమికి గల కారణాలపై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమిపాలు కావడానికి కారణం మీరంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.నిన్న ఒక్కరోజులోనే పార్టీ కార్యాలయానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి.

అసెంబ్లీ ఫలితాలు ప్రకటించిన తర్వాత నుంచి ఈ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయట.దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు రావడం , గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఈ ఫిర్యాదులు చేస్తున్నారట.ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ప్రత్యర్థి పార్టీకి, అభ్యర్థులకు సహకరించాలని పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఓటమికి కారణమయ్యారంటూ వివిధ స్థాయిలో నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు.ఇక పార్టీ నాయకులు మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు, ద్వేషాలతోనూ ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
నిన్న బిజెపి కార్యాలయంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎం ధర్మారావు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చాయి.

ఈ నెలాఖరులోగా ఈ ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసిన వారు, ఎన్నికల బాధ్యతలు సరిగా నిర్వహించని వారికి, నిర్లక్ష్యం వహించిన వారికి, పార్టీకి నష్టం జరిగే విధంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు .వారం, పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు పార్టీ జిల్లా అధ్యక్షులు, 10 మది వరకు రాష్ట్రస్థాయి నాయకులు ఉన్నట్లు సమాచారం.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) ఈ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే బిజెపి వీటన్నిటి పైన దృష్టి సారించింది.