ఏ దేశమేగినా ఎందు కాలిడినా అని చిన్నప్పుడు మనం చదువుకున్న దేశ భక్తి గేయాలు ఇప్పటికి చెవుల్లో మారు మోగుతూనే ఉంటాయి.ఏ దేశంలో ఉన్నా కన్న తల్లిపై ప్రేమ, పుట్టిన ఊరిపై అభిమానం, తమ ప్రాంత భాషపై మక్కువ పోతాయా అంటే కొందరిలో అవి అసంభంవమనే చెప్పాలి.
ఈ కట్టే కాలే వరకూ నా మాత్రు భూమికి, నా మాత్రు బాషకు, నా మనుషులకు సేవలు చేస్తూనే ఉంటాను అని కంకణం కట్టుకున్న ప్రవాస తెలుగు వారు ఎంతో మంది ఉన్నారు.అలాంటి వారిలో రాధిక మంగిపూడి ఒకరు.
సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ అలాగే వీధి అరుగు సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో వర్చువల్ ద్వారా ఆగస్టు 28, 29 తేదీలలో రెండు రోజుల పాటు తెలుగు బాషా దినోత్సవం -2021 ను ఎంతో వైభవంగా జరుపుకోనున్నారు.ఈ సందర్భంలో తెలుగు బాషా సాహిత్యం, సంస్కృతీ వికాసం కోసం ఎంతో శ్రమించిన 12 మందికి ప్రవాస తెలుగు పురస్కారం అందించనున్నారు.
అయితే ఈ పురస్కారానికి సింగపూర్ లో స్థిరపడిన రాధిక మంగిపూడి కూడా ఎంపిక అయ్యారు.తెలుగు సాహిత్య ప్రపంచానికి రాధిక మంగిపూడి అంటే తెలియని వారు ఉండరు, ముఖ్యంగా సింగపూర్ లోని తెలుగు సమాజానికి ఆమె సుపరిచితురాలు.

సింగపూర్ నుంచీ తోలి తెలుగు రచయితగా ఆమె ఎంతో గుర్తింపు పొందారు.అంతేకాదు రెండు పుస్తకాలను ప్రచురించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.అలాగే సింగపూర్ లో తెలుగు బాషాభివ్రుద్ది పై ఎంతో కృషి చేశారు.అక్కడి శ్రీ సాంస్కృతిక కళా సారధి ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలిగా అత్యంత కీలక భాద్యతలు నిర్వహిస్తున్నారు.
తెలుగు సంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమెకు ఎంతో గుర్తింపు లభించింది.దాదాపు 45 అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యానం అందించారు రాధిక.అతిధిగా, మంచి వక్తగా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు.ఇదిలాఉంటే ప్రపంచ వ్యాప్తంగా అందించే ఈ ప్రవాస తెలుగు పురస్కారం- 2021 ఎంపిక చేసిన 12 మందిలో తనకు కూడా స్థానం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని, తనకు ప్రోశ్చాహం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.