ఆర్టీసీ కార్మికుల ఐక్యత,హక్కుల సాధన కోసం పోరాటాలే మార్గమనే సూత్రబద్ధ వైఖరితో, ఐక్యత పోరాటం నినాదంతో భారత కార్మిక సంఘాల కేంద్రం (సిఐటియు)కు అనుబంధంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్( ఎస్ డబ్ల్యూ ఎఫ్) 1979 సెప్టెంబర్ 16వ తేదీన ఆవిర్భవించిందని సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం ఖమ్మంలోని సిహెచ్.
వి.రామయ్య స్మారక భవనం వద్ద గుండు మాధవరావు అధ్యక్షతన ఏర్పాటైన ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి ఆత్మీయ అతిథిగా పాల్గొని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ చండ్ర వెంకట్రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం శ్వేతారుణ ఎస్ డబ్ల్యూ ఎఫ్ పతాకాన్ని కళ్యాణం వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కళ్యాణం వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ,ఆర్టీసీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్మికవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా,ప్రభుత్వ,కార్మిక వ్యతిరేక విధానాలను నికరంగా ఎండగడుతూ ఆర్టీసీ కార్మికుల ఐక్యతకు వారధి గా సమరశీల పోరాటాల సారధి గా నిలిచిందని ప్రశంసించారు.ఆర్టీసీలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆవిర్భావం తర్వాతనే ఐక్య పోరాటాల ఒరవడి ప్రారంభమైందన్నారు.
నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల దుష్ఫలితాలను ముందుగానే గ్రహించి కార్మికులను చైతన్యం జేయడంలోనూ,ఆవిధానాలను వ్యతిరేకిస్తూ కార్మికవర్గాన్ని పోరాటంలో నిలపడంలోనూ ఎస్ డబ్ల్యూ ఎఫ్ అగ్రభాగాన నిలిచిందని అభినందించారు.ఆర్టీసీలో సంఘాల మధ్య శత్రుత్వం అవసరం లేదని కార్మిక హక్కుల సాధన,సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలే ఏకైక మార్గమని కుల,మత,ప్రాంత,రాజకీయ విభేదాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన ఐక్య పోరాటాల సంఘం ఆర్టీసీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మాత్రమే అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితులను కార్మిక వర్గం గమనించాలని ఆయన తెలిపారు.ఆర్టీసీ కార్మిక వర్గం ఐక్యంగా ఉండి సంస్థను పరిరక్షించుకోవాలని అందుకు సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు.
సిఐటియు అనుబంధ సంఘంగా కార్మికవర్గ ఐక్యతను కోరుకుంటున్న స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నినదించిన ఐక్యతా పోరాటం నినాదాన్ని ఆర్టీసీ కార్మికుల అందరినోట పలికించిన ఏకైక సంఘం కూడా ఆర్టీసీలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ మాత్రమే నని ఆయన ప్రశంసించారు.ఖమ్మం రీజియన్ లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనేక నిర్బంధాలను అధిగమించి కార్మిక వర్గానికి అండగా నిలిచిందని, సిఐటియు అనుబంధ సంఘంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ భవిష్యత్తులోనూ అదే ఒరవడి కొనసాగిస్తుందన్నారు.
ఆర్టీసీలో కార్మిక చట్టాలకు అతీతంగా విపరీతమైన పని భారాలు పెంచుతున్నారని,ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా మహిళా కార్మికులను రాత్రి 8-00 గంటల తర్వాత కూడా విధులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులు పెంచాల్సి ఉండగా ఖమ్మం రీజియన్ లో షెడ్యూల్స్ తగ్గించిన ఫలితంగా మిగులు తేల్చబడి ఆదిలాబాద్,నిజామాబాద్ రీజియన్లకు డిప్యూటేషన్ పై బదిలీ చేయబడ్డ డ్రైవర్ల సమస్యను వారి ఇబ్బందులను,కుటుంబాల పరిస్థితులను విజ్ఞాపన పత్రం ద్వారా రీజనల్ మేనేజర్ కు తెలియజేశామన్నారు.
ఆర్టీసీ కార్మికుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రభుత్వ,యాజమాన్య విధానాలు ఎంతో కాలం కొనసాగవని,ఐక్య పోరాటాల ద్వారా కార్మిక వర్గానికి మంచి రోజులు రానున్నాయని అందుకోసం కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి ప్రసంగిస్తూ,ఆర్టీసీలో కార్మిక సంఘాల మధ్య ఐక్యతను సాధించి ఐక్య పోరాటాలు జయప్రదంగా నిర్వహించడంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ సఫలీకృతం అయిందని పేర్కొన్నారు.
ఎస్ డబ్ల్యూ ఎఫ్ లేకుండా ఆర్టీసీలో ఏఒక్క ఐక్యపోరాటం జరగలేదని తెలియజేశారు.ఆర్టీసీ కార్మికుల హృదయాలలో ఐక్య పోరాటాల సంఘంగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ ప్రతిష్ఠ సాధించిందని పేర్కొన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులే పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.44వ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ కార్మికులందరికీ లింగమూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు.యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు చండ్ర వెంకట్రామయ్య చిత్రపటానికి హాజరైన సభ్యులందరూ ఘనంగా పూలతో నివాళులర్పించారు.అనంతరం డిపో కమిటీ సహాయ కార్యదర్శి పగిళ్ళపల్లి నరసింహారావు వందన సమర్పణతో ముగిసిన ఈ కార్యక్రమంలో రీజియన్ ప్రచార కార్యదర్శి తోకల బాబు,రీజియన్ కోశాధికారి తాళ్ల సితార(పర్వీణ),నాయకులు ఎనబోతుల శ్రీనివాస్,రాములు, గడ్డం అయోధ్య,కే.
కృష్ణయ్య,సీతమ్మ,రాధ,జ్యోతి,శాంతకుమారి,లలిత,ఉమా,కోటేశ్వరరావు,వేణు, ఆకుతోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.