చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి గురించి తెలుగు వారికి ఇంతక ముందు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు.అయితే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆసుపత్రి గురించే మాట్లాడుకుంటున్నారు.
గత నెల ఆగస్టు 5 న తనకు కరోనా సోకింది అని త్వరలో కరోనా నుంచి కోలుకొని మీ ముందుకు వస్తాను అంటూ చెప్పిన బాలు గారు ఆసుపత్రి లోనే తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతూ గత శుక్రవారం కన్నుమూశారు.
ఆయన వయసు 74 సంవత్సరాలు కాగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతరత్రా ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన 52 రోజుల పాటు ఆసుపత్రిలో పోరాడి పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయారు.ఈ 2020 సంవత్సరం ఎందరో ప్రముఖులను కోల్పోయినా వాటన్నిటి కన్నా గాన గంధర్వుడు బాలు మృతి మాత్రం అందరినీ విషాదంలోకి నెట్టింది.
ఆయన మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసినట్టైయింది.అంతేకాదు ఆయన 7 పదుల వయసులో కూడా తన గానామృతం తో అలరిస్తూనే ఉన్నారు.
అలాంటి మహోన్నత వ్యక్తి మృతి మాత్రం యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటుగా నిలిచిపోయింది.
అయితే 52 రోజుల పాటు బాలు గారు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లోనే చికిత్స పొందిన విషయం విదితమే.
అయితే ఆ మధ్య ఆయన కరోనా నుంచి కోలుకున్నారని,అయితే మరికొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయనను ఎక్మో, వెంటిలేటర్ సాయంతో ఐసీయూలో ఉంచినట్లు ఆ ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వెల్లడించాయి.అయితే ఎదో ఆయన త్వరలోనే కోలుకొని మరలా తిరిగి వస్తారులే అని భావించిన ఆయన అభిమానులు ఉన్నట్టుండి ఆయన మరణ వార్త వినడం తో ఒక్కసారిగా ఇప్పుడు ఆ ఆసుపత్రి గురించే చర్చించుకోవడం మొదలు పెట్టారు.
బాలుగారి ఆరోగ్యం సీరియస్‌గా ఉందని చెప్పిన 1 రోజులోనే ఆయన లేరనే వార్త వినాల్సి రావడంతో ఇప్పుడు ఆ హాస్పిటల్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు డబ్బుల కోసమే చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు బాలుగారిని ఇబ్బందులకు గురిచేసారని ఈ 52 రోజుల్లో ఆయన ఆసుపత్రి బిల్లు బాగా వసూలు చేసారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ కూడా దీనిపైనే చర్చలు మొదలు పెట్టారు.అయితే ఈ వార్తలపై ఎస్పీ బాలు కుమారుడు చరణ్ తాజాగా స్పందించారు.
అసలు ఎస్పీ బాలు హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంజీఎం వైద్యులు ఆయన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు అని, వారు కూడా నాన్న ఆరోగ్యం గురించి ప్రార్ధనలు చేశారు అంటూ చరణ్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు నాన్న ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఉపరాష్ట్రపతి గారు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీసేవారని, ఇక మనీ విషయంలో ఎంజీఎం హాస్పిటల్ పై రూమర్స్ అన్ని అబద్దమంటూ చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు.
దయచేసి ఇలాంటి అనవసర రూమర్స్‌ను వ్యాపింప చేయోద్దని ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అంశాలు మమ్మల్ని మరింత బాధకు గురి చేస్తున్నాయి అని ఇవన్నీ అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలి అంటూ చరణ్ కోరారు.