కరోనా వైరస్ వల్ల అన్ని దేశాలు ఎంతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఏడాదిన్నరగా ఆంక్షల చట్రంలోనే మనిషి జీవిస్తున్నాడు.
రెండు మూడు నెలల లాక్‌డౌన్ భరించలేక ఆస్ట్రేలియా ప్రజలు స్వేచ్ఛ కోసం ఎంతగా పరితపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాంటిది ఏడాదిన్నరగా బయటి ప్రపంచం మొహం చూడనివాళ్లు కూడా వున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.
అది ఎక్కడో కాదు సింగపూర్‌లోనే.
కోవిడ్ -19 తీవ్రత నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుండి వసతి గృహాలలో నివసిస్తున్న భారతీయ పౌరులతో సహా వలస కార్మికుల కదలికలపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
నాటి నుంచి వారు డార్మెటరీలలోనే మగ్గుతున్నారు.ఆంక్షలను ఉల్లంఘించి అడుగు బయటపెడితే జైళ్లో కూర్చోవాల్సి వస్తుందని భయపడి ఇబ్బందులు ఎదురైనా సరే భరిస్తూ వచ్చారు.ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ తీవ్రత అదుపులోకి రావడంతో క్రమంగా ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఒక మీడియా నివేదిక గురువారం తెలిపింది

వచ్చే సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ఆంక్షల ఎత్తివేత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అధికారులు.మొదట దక్షిణాసియా వాసులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన లిటిల్ ఇండియాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.ఈ ప్రాంతంలోని వసతి గృహాలలో నివసిస్తున్న .భారతీయులు సహా ఇతర వలస కార్మికులు వారాంతాలలో భారత సంతతికి చెందిన దుకాణ సముదాయాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అయితే సందర్శనకు ముందు.మూడు రోజుల తర్వాత కార్మికులు యాంటిజెన్ రాపిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది.టీకాలు వేయించుకోని కార్మికులు జాగ్రత్తలు, అదనపు పరీక్షలు చేయించుకోవాలని సింగపూర్ మానవ శక్తి మంత్రి తెలిపారు.
వసతి గృహాలలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూడటంతో గతేడాది ఏప్రిల్‌లోని దేశంలోని అన్ని డార్మిటరీలపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
అదే సమయంలో వలస కార్మికులు కోవిడ్ బారినపడుతుండటంతో ఆయా ప్రాంతాలను ప్రభుత్వం క్లస్టర్లుగా గుర్తించింది.ఆంక్షల ఎత్తివేత సందర్భంగా తొలుత ప్రతి వారం ‘Safe Living Measures’తో పాటు రెండు వారాల నుంచి కోవిడ్ కేసులు నమోదు కానీ డార్మిటరీలకు చెందిన వలస కార్మికులను ఆరు గంటల పాటు ఆయా ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతించనున్నారు.