దేశ, విదేశాల్లో సిక్కు మతం అభ్యున్నతికి, సిక్కుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.సిక్కు మత పవిత్ర గ్రంథమైన ‘‘ గురు గ్రంథ్ సాహిబ్’’ సరూప్‌ను విదేశాలకు రవాణా చేస్తున్నప్పడు ‘‘మర్యాద’’ (కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘనలను నివారించేందుకు గాను ఈ పవిత్ర గ్రంథాన్ని ముద్రించడానికి విదేశాలలో ప్రింటింగ్ ప్రెస్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ‘‘సరూప్’’లను పంపడానికి ఎస్‌జీపీసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సందర్భంగా ఎస్‌జీపీసీ అధ్యక్షురాలు బీబీ జాగీర్ కౌర్ మాట్లాడుతూ.
‘‘మర్యాద’’ ఉల్లంఘనల ఆందోళనల నేపథ్యంలో ‘‘సరూప్’’లు ఎస్‌జీపీసీ పర్యవేక్షణలో ముద్రిస్తామని ఆమె తెలిపారు.ఈ మేరకు కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రధానంగా సిక్కులు పెద్ద సంఖ్యలో స్ధిరపడిన అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, కెనడా, న్యూజిలాండ్‌లలో ప్రింటింగ్ ప్రెస్‌లను ఏర్పాటు చేస్తామని కౌర్ వెల్లడించారు.ఈ పని కోసం విదేశీ ‘‘సంగత్’’, గురుద్వారా నిర్వహణ కమిటీల మద్ధతు ఉంటుందని జాగీర్ కౌర్ చెప్పారు.
గుజరాత్‌లోని వివిధ గురుద్వారాల కోసం 100 ‘‘సరూప్’’లను పంపాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని.ఎస్‌జీపీసీ ప్రత్యేక బస్సు ద్వారా అక్కడికి ‘‘ సరూప్’’లను చేరవేస్తామని ఆమె తెలిపారు.
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం పైనా జాగీర్ కౌర్ స్పందించారు.ఆఫ్గన్ నుంచి భారత్‌కు వస్తున్న సిక్కు సంతతి ప్రజలకు వసతి కల్పిస్తామని వెల్లడించారు.అలాగే సెంట్రల్ సిక్కు మ్యూజియంలో 2019లో విధి నిర్వహణలో మరణించిన యూఎస్ సిక్కు సంతతి పోలీస్ అధికారి సందీప్ సింగ్ ధాలివాల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌జీపీసీ ప్రకటించింది.అలాగే ధాలివాల్ స్మారక చిహ్నం కోసం రూ.10 లక్షలు కేటాయించింది.

కాగా, 2019 సెప్టెంబర్ 27న ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న సందీప్ సింగ్‌ను ఓ దుండగుడు తుపాకీతో కాల్చాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో ఆయన స్మారకార్థం హ్యూస్టన్‌లోని 315 అడిక్స్ హోవెల్ రోడ్డులో ఉన్న పోస్టాఫీసును ‘డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ పోస్టాఫీస్ భవనం’గా పేరు మార్చి ఆయనను అమెరికా ప్రభుత్వం గౌరవించింది.
అందుకు సంబంధించిన బిల్లుపై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.