భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.
కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.
ఒట్టావాలోని భారత హైకమీషన్ గణాంకాల ప్రకారం.
కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్ (మొత్తం సభ్యుల సంఖ్య 338)లో ప్రస్తుతం 22 మంది భారత సంతతి ఎంపీలు వున్నారు.వీరిలో రక్షణ మంత్రిగా హర్జిత్ ఎస్ సజ్జన్, యువజన వ్యవహరాల శాఖ మంత్రిగా బార్దీష్ చాగర్, ప్రజా సేవల శాఖ మంత్రిగా అనితా ఆనంద్ విధులు నిర్వర్తిస్తున్నారు.
అన్నింటికి మించి మైనారిటీలో వున్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి పార్లమెంట్‌లో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు న్యూడెమొక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20న జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికల్లో పలువురు భారతీయులు బరిలో నిలిచారు.
గత వారాంతంలో న్యూబ్రన్స్‌విక్ ప్రావిన్స్‌లో జరిగిన ప్రచారంలో కెనడా ప్రధాని ట్రూడో తనతో పాటు భారత సంతతి మంత్రి అనితా ఆనంద్‌ను ప్రచారానికి తీసుకెళ్లారు.ఆమె ఒంటారియోలోని ఓక్విల్లే నుంచి మరోసారి ఎన్నికయ్యేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు.
అలాగే ఒంటారియోలోని వాటర్లూ రైడింగ్ నుంచి 2015 నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న బర్దిస్ చాగర్ కూడా మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఇక ట్రూడో కేబినెట్‌లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న హర్జిత్ సజ్జన్ కూడా వాంకోవర్ సౌత్ నుంచి మరోసారి ఎంపీగా గెలవాలని ఊవ్విళ్లూరుతున్నారు.ఈ జిల్లా జనాభాలో భారతీయులు అధిక సంఖ్యలో వున్నారు.అయితే ఇదే స్థానం నుంచి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సుఖ్‌బీర్‌సింగ్ గిల్ కూడా భారత సంతతికి చెందిన వారే కావడంతో ఇక్కడ పోటీ ఆసక్తిగా మారే అవకాశం వుంది.
ఇక 2019 బ్రిటీష్ కొలంబియాలోని బర్నాబీ సౌత్ గెలిచిన న్యూడెమొక్రాటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్ ఈ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.2019 ఫెడరల్ ఎన్నికల్లో సింగ్ నాయకత్వంలోని న్యూడెమొక్రాట్లు 24 సీట్లను గెలుచుకుని సత్తా చాటారు.ఇదే సమయంలో ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచిన జగ్మీత్ సింగ్ కింగ్‌మేకర్‌గా అవతరించారు.మరోసారి ఇదే రిపీట్ అవుతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి.వీరితో పాటు ఉజ్జల్ సింగ్, రణదీప్ ఎస్ సారాయ్, మణిందర్ సిద్దూ, రూబీ సహోటా, కమల్ ఖేరా, సోనియా సిద్దూ, నవదీప్ వంటి భారత సంతతి వ్యక్తులు కూడా మరోసారి బరిలో నిలిచారు.