వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.ఎలాగోలా వీసా సంపాదించి అక్కడ చదువుకుంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు అనుకునే భారతీయులు లక్షల్లో వున్నారు.
ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలన్నది యువత కల.
అలా దశాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.
జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో మెరుగ్గా వుండటంతో వివిధ దేశాల ప్రజలకు అమెరికా అంటే వ్యామోహం నానాటికీ పెరుగుతోంది.అన్ని రకాలుగా ప్రోత్సహం లభించడంతో పాటు అగ్రరాజ్యంలోని అత్యున్నత పదవులను విదేశీ పౌరులు చేజిక్కించుకుంటున్నారు.
సమర్ధత, మేధస్సు, అనుభవం వుంటే చాలు అమెరికన్లు అందలమెక్కిస్తున్నారు.ఇందుకు ఎన్నో ఉదాహరణలు.
భారతీయులు, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, ఆఫ్రికా ఖండాల వారు అక్కడ రాణిస్తున్నారు.ఇక భారతీయులను అమెరికన్లు ఎంతగానో ప్రేమిస్తారు.
కష్టాల్లో వున్న మనవారిని ఎందరో ఆదుకున్నారు.మన భారతీయ పద్ధతులను, సంస్కృతులను అమెరికన్లు బాగా పాటిస్తున్నారు.
ఇటీవలి కాలంలో అమెరికన్లు, భారతీయుల మధ్య అనుబంధం దృఢ పడుతోంది.ఇప్పటికే అగ్రరాజ్యంలో ఎన్నో రంగాల్లో భారతీయులు కీలక స్థానాల్లో వున్నారు.
రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.
అమెరికా అనగానే సంపన్న దేశం అనుకుంటారు.కానీ అక్కడ కూడా నిరుపేదలు వున్నారు.ముఖ్యంగా ఇళ్లు లేని వారు ఎందరో.అమెరికా నగరాల్లోని రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లు, పార్క్‌ల వద్ద చిన్న చిన్న టెంట్లు వేసుకుని నివసించేవారు లక్షల్లో వున్నారు.ఖరీదైన దేశం కావడంతో అక్కడ ఇంటి అద్దెలు కూడా ఓ రేంజ్‌లో వుంటాయి.తాజాగా కోవిడ్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో అనేకమంది సొంతింటి వారు కూడా అద్దె ఇళ్లకు మారిపోతున్నారు.
దీంతో ఒక్కో ఇంటికి దాదాపు నలుగురైదుగురు దరఖాస్తులు చేసుకుంటున్నారు.ఈ కారణంగా.
ఒక్కసారిగా అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది.ఫలితంగా అద్దెలు కూడా చుక్కలను తాకుతున్నాయి.
ప్రధానంగా టంపా, ఫ్లోరిడా, టూ మెంఫిస్, టెన్నెస్సీ, రివర్ సైడ్, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గడిచిన మూడు నెలల కాలంలోనే అమెరికాలో దాదాపు 5లక్షలకు పైగా అద్దె అపార్ట్‌మెంట్లలో జనాలు పాలు పొంగించినట్లుగా తెలుస్తోంది.1993 తర్వాత ఈ స్థాయిలో అద్దె ఇళ్లకు జనాలు చేరుకోవడం ఇదే తొలిసారని ఇండస్ట్రీ కన్సల్టెంట్ రియల్ పేజ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.దేశంలోని ఈ పరిస్థితిని ఇంటి యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు.
ఇంటి అద్దెల్ని దాదాపు 17 శాతం పెంచేస్తున్నారు.అయినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
స్థానిక అమెరికన్ల సంగతే ఇలా వుంటే.అక్కడికి వలస వెళ్లే విదేశీయులు ముఖ్యంగా భారతీయుల పరిస్ధితి దారుణంగా తయారైంది.
అందుకే అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడానికి ముందే అద్దె ఇంటిని ముందే మాట్లాడి పెట్టుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.