కోవిడ్ కారణంగా గడిచిన ఏడాదిన్నరగా అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపై బ్రిటన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఇందులో భారత్ కూడా వుంది.
మనదేశంలో సెకండ్ వేవ్ ఉవ్వెత్తున ఎగిసిపడటంతో యూకే సర్కార్ భారతీయులపై బ్యాన్ కొనసాగించింది.అయితే ఇండియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడినందున ఇటీవల రెడ్‌లిస్ట్ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్‌లో చేర్చింది.
ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.దీంతో భారతీయులు పెద్ద సంఖ్యలో యూకే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ పరిస్ధితుల్లో యూకే ప్రభుత్వం భారతీయులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.కొత్త ట్రావెల్ రూల్స్ ప్రకారం.కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న భారతీయులను యూకేలో టీకాలు వేయించుకోని వారిగానే పరిగణించబడతారని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాకుండా దేశంలో అడుగుపెట్టిన భారతీయులు తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాలని తేల్చిచెప్పింది.
దీంతో విషయం భారత ప్రభుత్వం వరకు వెళ్లింది.ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది.

దీంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా రంగంలోకి దిగారు.పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని యూకేను కోరారు.అలాగే యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన కేంద్రమంత్రి.క్వారంటైన్ నిబంధనలు, కొత్త మార్గదర్శకాల విషయాన్ని కూడా ప్రస్తావించారు.రెండు దేశాల పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్ తెలిపారు.

భారత్ విజ్ఞప్తితో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని సైతం అనుమతిస్తున్నట్లు యూకే నిబంధనలు సవరించింది.సవరించిన మార్గదర్శకాల ప్రకారం.ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వాక్సేవ్రియా, మోడరన్ టకేడా వంటి వ్యాక్సిన్లను లిస్ట్‌లో చేరుస్తున్నట్లు యూకే తెలిపింది.కానీ ఇక్కడే బ్రిటన్ మెలిక పెట్టింది.కొవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు కూడా క్వారంటైన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.సమస్య కొవిషీల్డ్ కాదని, ఇండియాలోని వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్‌పై అనుమానాలే అసలు సమస్య అని చెప్పింది.
అలాగే భారత్ వ్యాక్సిన్ సర్టిఫికేషన్‌ను గుర్తించేందుకు ఇండియాతో కలిసి పని చేస్తున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది.