దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది .దీనిలో భాగంగానే బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి బలోపేతం చేయకపోతే, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వస్తుందనే భయం ఆ పార్టీ అగ్రనేతలను వెంటాడుతోంది.
అందుకే భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్రను చేపట్టారు.ఇక ఎప్పుడూ లేనివిధంగా ఏఐసిసి అధ్యక్ష పదవి గాంధీయేతర కుటుంబానికి అప్పగించారు.
కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే తన మార్క్ చూపిస్తూ పార్టీ కీలక నాయకులు అందరితోనూ సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీని ప్రక్షాళన చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆయా రాష్ట్రాల్లో పార్టీ కమిటీలను మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తూ, యువనాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ లో మార్పులు మొదలయ్యాయి .దీనిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పైన దృష్టి సారించారు.ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ ను బలోపేతం చేసే బాధ్యతను అనధికారికంగా తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ కు మొదటి నుంచి బలం ఉన్నా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, టిఆర్ఎస్ బలోపేతం కావడం, అనూహ్యంగా బిజెపి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అన్నట్లుగా హడావుడి చేస్తూ రోజుకు బలం పెంచుకుంటూ ఉండటంతో, కాంగ్రెస్ పట్టు మరింత చేజారి పోకుండా చూసుకునే బాధ్యతలను ప్రియాంక గాంధీ తీసుకున్నారు.ఇప్పటికే పార్టీలో ఇబ్బడి ముబ్బడిగా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సీనియర్ నాయకులకు మధ్య ఏమాత్రం సర్కిత లేకపోవడం తదితర వ్యవహారాలన్నిటిని ప్రియాంక ఆరా తీస్తున్నారట.
ఇక పూర్తిగా తెలంగాణ బాధితులను తానే చూస్తానని, తెలంగాణలో ఏ వ్యవహారం పైన అయినా తనతో సంప్రదించాలని ఆమె పార్టీ నాయకులను ఆదేశించినట్లు సమాచారం.సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోతుండడం , ఇప్పటికే ఎంతోమంది ఈ విధంగా బయటికి వెళ్లిపోయినా, వారిని కట్టడి చేసేందుకు రేవంత్ ప్రయత్నాలు చేయకపోవడం , పార్టీలో మొదటి నుంచి ఉన్న మర్రి శశిధర్ రెడ్డి వంటి వారు ఇటీవల పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన క్రమంలో, ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నారట.తెలంగాణ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నా, పేరుకు మాత్రమే తప్ప పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో వారందరినీ మార్చి యాక్టివ్ గా ఉన్న నేతలకు ఆ పదవులు ఇచ్చే ఆలోచనలో ప్రియాంక ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూపు రాజకీయాలను చక్కదిద్ది, తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంపైనే ప్రియాంక పూర్తిగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల సమాచారం.