ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్లు.దాదాపు 20 ఏళ్లుగా మధ్య ఆసియాలో ఎంతో ప్రశాంతంగా వున్న ఈ దేశం.
తాజాగా అమెరికా సేనల నిష్క్రమణతో రావణ కాష్టంలా మారింది.దీంతో ఆఫ్ఘన్ల పరిస్దితి, తాలిబన్ల అరాచకాలను అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.
ఇదే సమయంలో బిక్కుబిక్కుమంటున్న ఆఫ్ఘన్లకు కొన్ని దేశాలు మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తున్నాయి.అయితే ఆఫ్ఘన్ భూభాగాన్ని స్థావరంగా చేసుకుని అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు మరోసారి పెట్రేగిపోతాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ఆఫ్గన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ , అక్కడి తాజా పరిస్ధితులపై భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి స్పందించారు.ఇకపై తీవ్రవాదంపై పోరాటంలో భారత్- అమెరికా పరస్పరం సహకరించుకోవాలని ఆయన అన్నారు.
ఐస్ఐఎస్, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులకు ఆఫ్ఘన్ అత్యంత సురక్షితమైన స్వర్గధామంగా మారకుండా.ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా తన ఉగ్రవాద నిరోధక కార్యక్రమాన్ని కొనసాగించాలని రాజా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
ఇంటెలిజెన్స్‌తో పాటు తీవ్రవాదానికి సంబంధించిన అంశాలపై భారత్, అమెరికాలు సహకరించుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన కోరారు.ఇల్లినాయిస్ నుంచి మూడుసార్లు కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కృష్ణమూర్తి.
ఇంటెలిజెన్స్‌పై హౌస్ పర్మినెంట్ సెలక్ట్ కమిటీలో మొట్టమొదటి ఇండో అమెరికన్ సభ్యుడు.అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్వహించిన సుదీర్గ పోరాటం ముగిసిందన్నఆయన.
అక్కడ సేవలందించిన అమెరికా సైనికులను ప్రశంసించారు.అలాగే గడిచిన రెండు వారాలుగా ఆఫ్ఘన్ నుంచి 1,20,000 మంది ప్రజలు వివిధ దేశాలకు వెళ్లడానికి తోడ్పడ్డారని కృష్ణమూర్తి కొనియాడారు.

20 ఏళ్లపాటు ట్రిలియన్ డాలర్ల ఖర్చు, వేలాది మంది అమెరికా సైనికులు మరణించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి జవాన్లు వెనక్కి వచ్చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.ఇదే సమయంలో ఆఫ్ఘన్ నుంచి అమెరికా నిష్క్రమించిన విధానాన్ని పరిశోధించాల్సిన అవసరం వుందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.మెజారిటీ అమెరికన్లు అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే అక్కడ తమకు సాయం చేసిన ఆఫ్ఘన్ పౌరులు తాలిబన్లకు లక్ష్యంగా మారకుండా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అమెరికా ముందున్న కర్తవ్యమని కృష్ణమూర్తి పేర్కొన్నారు.