దేశాధినేతలు వివిధ దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి అధ్యక్షులకు కానుకలు తీసుకెళ్లడం ఆనవాయితీ.ప్రాచీన కాలం నాటి ఈ సాంప్రదాయాన్ని నేటికీ మన రాజకీయ నాయకులు ఫాలో అవుతున్నారు.
ఇలాంటి వాటివల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు, నేతల మధ్య అనుబంధం మరింత పెరుగుతూ వుంటుంది.
ఇక విషయంలోకి వెళితే.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ నిన్న అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో అమెరికా అధికారులు, భారతీయ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.
పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధాని ఐదు దిగ్గజ కంపెనీలు అయిన క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్‌స్టోన్ సీఈవోలతో చర్చలు నిర్వహించారు.ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ యోషిహిదే సుగాతో భేటీ అయ్యారు.ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సుగాతో మోదీ చర్చించారు.ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.

ఆ వెంటనే వైట్‌హౌస్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికా యంత్రాంగానికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు.అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చరిత్రాత్మకమని ఆయన అన్నారు.
భారత్- అమెరికా సహజ భాగస్వాములు అని .రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని, ఒకే రకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని మోడీ గుర్తుచేశారు.

కమలా హారిస్ తో భేటీ సందర్భంగా మోడీ ఓ అరుదైన కానుకను ఆమెకు అందజేశారు.అది ఓ చెక్క కళాఖండం.ఈ కళాకృతిని అందుకున్న కమలా హారిస్ మురిసిపోతూనే భావోద్వేగానికి గురయ్యారు.అందుకు కారణం… ఆ చెక్క జ్ఞాపికను రూపొందించింది కమలా హారిస్ తాత పీవీ గోపాలన్.పీవీ గోపాల్ హస్తకళల నిపుణుడు.తన తాత రూపొందించిన కళాఖండాన్ని తనకు కానుకగా ఇవ్వడం పట్ల కమలా హారిస్ మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, కమలా హారిస్ తాతయ్య పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు.చిన్నతనంలో తరచూ చెన్నై రావడంతో కమలపై తాతగారి ప్రభావం పడింది.నేటికి బహిరంగ వేదికలపై తాతగారు తనకు చెప్పిన మాటలను, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ వుంటారు.చెన్నై బీచ్‌లో తాతయ్యతో నడవటంతో పాటు దక్షిణాది సాంప్రదాయ వంటకాలను రుచి చూడటం తనకెంతో ఇష్టమని కమలా హారీస్ అంటూ వుంటారు.

మోడీ… వారణాసిలో తయారైన మీనాకారీ చదరంగం బోర్డును కూడా కమలా హారిస్ కు అందించారు.అంతేకాదు, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కు వెండితో రూపొందించిన మీనాకారీ నౌక బొమ్మను బహూకరించగా, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపుచెక్కతో రూపొందించిన బుద్ధ ప్రతిమను కానుకగా ఇచ్చారు.