ఏదైనా విపత్తు లేదా ప్రమాదం ఎదురైనప్పుడు దాని నుంచి గుణపాఠం నేర్చుకోవడంలోనూ , మరోసారి ఎలాంటి ఉపద్రవానికి తావు ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడంలోనూ న్యూజిలాండ్ ముందుంటుంది.కరోనా మహమ్మారిని అద్భుతంగా నిలువరించి ప్రపంచ దేశాల మన్ననలు పొందింది ఈ చిన్న దేశం.
తొలి విడత కరోనా వెలుగు చూసిన 2020 మార్చి నుంచి న్యూజిలాండ్ అంతర్జాతీయ సరిహద్దును మూసివేసిన సంగతి తెలిసిందే.నాటి నుంచి ఇదే వైఖరిని అవలంభిస్తూ కట్టుదిట్టమైన చర్యల ద్వారా ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కరోనాను కట్టడి చేసి ప్రశంసలు పొందారు.
ఇక క్రైస్ట్‌చర్చ్‌లో ఉగ్రదాడి తర్వాత నిఘా పెంచడంతో పాటు తుపాకుల అమ్మకాలపైనా నియంత్రణ చర్యలు చేపట్టింది న్యూజిలాండ్.తాజాగా రెండు రోజుల క్రితం ఓ సూపర్ మార్కెట్‌పై ఉగ్రదాడి జరగడంతో ఆ సంస్థ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా వున్న తమ సూపర్ మార్కెట్లలో కత్తులు, కత్తెరలను డిస్‌ప్లే నుంచి తొలగిస్తున్నట్లు కౌంట్‌డౌన్ గ్రూప్ ప్రకటించింది.
వినియోగదారులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో వుంచుకుని నిన్న రాత్రి నుంచి కత్తులు, కత్తెరలను తాత్కాలికంగా తీసివేయాలని నిర్ణయించినట్లు కౌంట్‌డౌన్ జనరల్ మేనేజర్ కిరి హన్నిఫిన్ తెలిపారు.
అలాగే ఇకపై వాటిని విక్రయించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.కౌంట్‌డౌన్ గ్రూప్ దారిలోనే మిగిలిన సూపర్ మార్కెట్ చైన్‌లు కూడా పదునైన కత్తుల అమ్మకాలను తాత్కాలికంగా విరమించుకున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి.
కాగా, ప్రశాంతకు మారుపేరైన న్యూజిలాండ్‌పై మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.అక్లాండ్‌లో వున్న సూపర్ మార్కెట్‌లోకి చొరబడిన ఉగ్రవాది.
ఆరుగురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.అయితే అత్యంత వేగంగా స్పందించిన భద్రత బలగాలు అతనిని కేవలం 60 సెకన్లలోపే హతమార్చినట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు.
న్యూ లిన్ మాల్‌లోని కౌంట్‌డౌన్ సూపర్‌మార్కెట్‌లో ఉగ్రవాది తొలుత కొంత షాపింగ్ చేశాడు.ఆ వెంటనే అతను డిస్‌ప్లే నుండి ఒక కత్తిని తీసుకుని, తోటి వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.

సదరు ఉగ్రవాదిని శ్రీలంకకు చెందిన ఐఎస్ఐఎస్ ప్రేరేపిత వ్యక్తిగా గుర్తించారు.అతను 2011లో న్యూజిలాండ్‌కు వచ్చాడని, 2016 నుంచి అతనిపై జాతీయ భద్రతా దళం నిఘా పెట్టినట్లు ప్రధాని చెప్పారు.ఆ ఉన్మాది భావజాలం విపరీతంగా ఉన్న నేపథ్యంలో అతనిపై నిఘా పెట్టినట్లు జెసిండా తెలిపారు.ఉగ్రవాది దాడిలో గాయపడిన ఆరుగుర్ని భద్రతా దళాలు ఆసుపత్రికి తరలించాయి.వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.