ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఈ ముగ్గురూ రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఎవరికి వారు ఈ రాజకీయ ఆటలో పై చేయి సాధించేందుకు ముందుకు వెళ్తున్న విధానం ఒకే విధంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.
కేంద్రంలో అధికార పార్టీ గా ఉన్న బిజెపి ఎదురే లేదన్నట్లుగా వ్యవహారాలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది.కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ బీజేపీకి రావడంతో ఏ నిర్ణయం తీసుకున్నా, అది వెంటనే అమలు అవుతోంది.
తమపై పోరాడేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలహీన పడడం, ఆ పార్టీ నేతల మధ్య సయోధ్య లేకపోవడం, గ్రూపు రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే ఆశాభావం లేకపోవడం వంటి కారణాలతో అధికార పార్టీ బీజేపీకి ఎదురే లేకుండా పోయింది.
అసలు కాంగ్రెస్ ను బలహీనం చేసే విషయంలో బిజెపి వ్యూహాత్మకంగా వేసుకుంటూ వస్తున్న అడుగులు సక్సెస్ అవుతూనే వస్తున్నాయి.
ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి.అన్ని రాష్ట్రాలలోనూ పార్టీ బలహీనపడుతూ వస్తుండడంతో బీజేపీ ఆయా రాష్ట్రాలలో బలపడుతూ, మరింత బలం పెంచుకుంటూ వస్తోంది.
సరిగ్గా తెలంగాణలో టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు.ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉండడంతో, తమ విధానాలకు, రాజకీయంగా తమకూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు కేసీఆర్ ఆపరేషన్ కాంగ్రెస్ మొదలుపెట్టి, ఆ పార్టీలోని బలమైన నాయకులందరినీ టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
ఇంకా కొంత మంది నాయకులు టిఆర్ఎస్ వారిపైన అనేక కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ లోనూ అంత బలమైన నాయకులు లేకపోవడం, ఒక్క రేవంత్ రెడ్డి మినహా వారంతా మౌనంగా ఉండిపోవడం వంటి పరిణామాలు టిఆర్ఎస్ కు కలిసి వస్తున్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉంటారా అనే విధంగా ప్రస్తుత పరిస్థితి తయారవడంతో టిఆర్ఎస్ కు ఎదురే లేకుండా పోయింది.
ఇక ఏపీ విషయానికి వస్తే, ఇక్కడ దాదాపుగా ఇదే ఫార్ములాను సీఎం జగన్ అనుసరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.
కేవలం టిడిపిని బలహీనం చేయడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతూ, ఆ పార్టీ నాయకులు వివిధ కేసుల్లో ఇరికిస్తూ, గత టీడీపీ ప్రభుత్వంలోని అనేక అవినీతి, అక్రమాలను బయటకు తీస్తూ, హడావుడి చేస్తోంది.అధికార పార్టీ దూకుడుతో బెంబేలెత్తి పోయిన టిడిపి నాయకులు చాలా మంది వైసీపీలో చేరిపోగా, మిగిలిన నాయకులు ప్రభుత్వంపై పోరాడుతూ, అనేక విచారణ ఎదుర్కొంటూ, జైలు జీవితం గడుపుతున్నా, ప్రస్తుతం అధికార పార్టీపై గొంతెత్తి పోరాటం చేసేందుకు టిడిపి నాయకులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.

స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పదేపదే పార్టీ కేడర్ కు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నా, ఎవరు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.దీనికితోడు కేంద్ర అధికార పార్టీ బిజెపి సైతం, టిడిపిని మరింత బలహీనం చేసేందుకు వైసిపి తో జత కలవడం వంటి పరిణామాలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి పూర్తిగా బలహీనమై పోతున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ వ్యవహారాలను చూస్తుంటే, అటు కేంద్రంలోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ, మోదీ, కేసీఆర్, జగన్, ఈ ముగ్గురు ఒకే విధానాన్ని పాటిస్తూ, తమ నిర్ణయాలకు ఎదురే లేకుండా, ఎవరు ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రతిపక్షాలను బలహీనం చేసే ఎత్తుగడకు పాల్పడుతున్నట్లు కనిపిస్తున్నారు.ఈ తరహా విధానం 2004 తర్వాత నుంచి ఎక్కువ అయినట్టు గా కనిపిస్తోంది.ప్రస్తుతానికి తాము చేసేది కరెక్ట్ అని అధికార పార్టీ నాయకులు నమ్ముతున్నా, ఈ పరిణామాలు మాత్రం ముందు ముందు రాజకీయాల్లో విపరీత ధోరణులకు ఆద్యం అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచన.
అధికార పార్టీతో పాటు, ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే, ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేందుకు, వాటిని సరిదిద్దుకుని అధికార పార్టీ ప్రజలకు మేలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
రాజకీయ రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితిని ప్రస్తుత అధికార పార్టీలు కూడా ఎదుర్కునే అవకాశం లేకపోలేదు.