కరోనా కారణంగా ఆస్ట్రేలియా పడరాని పాట్లు పడుతోంది.ముఖ్యంగా డెల్టా వేరియంట్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
దీంతో కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తోంది.ముఖ్యంగా దేశంలోనే పెద్ద నగరమైన సిడ్నీ, న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రాల్లో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.
అలాగే విక్టోరియా రాష్ట్రం, మెల్‌బోర్న్‌లలో సైతం లాక్‌డౌన్ అమలవుతోంది.అయితే స్వేచ్ఛా ప్రియులైన ఆస్ట్రేలియన్లు నెలల తరబడి ఇళ్లలో మగ్గిపోవడానికి ఇష్టపడటం లేదు.
నాలుగు గోడల మధ్య నలిగిపోలేక ఆస్ట్రేలియన్లు పలుమార్లు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు.సిడ్నీ, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ వంటి నగరాల్లో రోజూ ఎక్కడో ఒక చోట లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిరసనలు జరుగుతూనే వున్నాయి.
ఊహించని ఈ పరిణామంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేసేందుకు గాను ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది.
ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ సరిగా జరగడం లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న మోరిసన్ ప్రభుత్వానికి.
కొత్త తలనొప్పి ఎదురైంది.నిర్మాణ రంగంలో పని చేసే వ్యక్తులు తప్పనిసరిగా సింగిల్ డోసు వ్యాక్సిన్ అయినా వేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది.
అంతేకాకుండా మెల్‌బోర్న్ సహా పలు నగరాల్లో నిర్మాణ పనులను మంగళవారం నుంచి రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.అయితే ఈ నిర్ణయంపై కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళన నిర్వహిస్తున్నారు.తాజాగా మెల్‌బోర్న్‌లో దాదాపు 1000 మందికిపైగా నిరసనకారులు రోడ్లెక్కారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో పోలీసులను రంగంలోకి దింపి నిరసనను అణచివేసే ప్రయత్నం చేసింది.

ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రేలను, రబ్బర్ బాల్ గ్రెనేడ్లను, ఫోమ్ బాటన్ రౌంట్లను ప్రయోగించారు.నిరసనకారుల దాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.అలాగే 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
దేశంలో నానాటికీ పెరుగుతున్న కోవిడ్ కేసులను తగ్గించడంతో పాటు, ఆరోగ్య కారణాల రీత్యా సింగిల్ డోస్ నిబంధనను విధించినట్లు అధికారులు చెప్పారు.వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న వారు అక్టోబర్ 5 నుంచి యథావిధిగా పనులకు హాజరుకావొచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది.