కరోనా వైరస్‌తో ఆస్ట్రేలియా అల్లాడుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా డెల్టా వేరియంట్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
దీంతో కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తోంది.ముఖ్యంగా దేశంలోనే పెద్ద నగరమైన సిడ్నీ, న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రాల్లో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.
అలాగే విక్టోరియా రాష్ట్రం, మెల్బోర్న్లలో సైతం లాక్డౌన్ అమలవుతోంది.అయితే స్వేచ్ఛా ప్రియులైన ఆస్ట్రేలియన్లు నెలల తరబడి ఇళ్లలో మగ్గిపోవడానికి ఇష్టపడటం లేదు.
ఇప్పటికే పలుమార్లు రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ ఎత్తివేయాలని ఆందోళనలు నిర్వహించారు.ఊహించన ఈ పరిణామంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేసేందుకు గాను ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది.
తాజాగా మెల్బోర్న్ వాసులు లాక్డౌన్ ఎత్తివేయాలంటూ రోడ్లెక్కారు.దాదాపు వేయి మంది రోడ్లపై చొచ్చుకొచ్చి లాక్డౌన్ ఎత్తివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనం తమను అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, సీసాలు విసురుతూ దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
అనంతరం అదనపు బలగాలు రావడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది.ఈ నేపథ్యంలోనే 235 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించినట్లు విక్టోరియా పోలీస్ కమాండర్ మార్క్ గల్లియోట్ తెలిపారు.నిరసనలకు ముందు ఆందోళనకారులు బ్రడ్జిరోడ్లోని రిచ్మండ్ టౌన్ హాల్ వెలుపల మధ్యాహ్న సమయంలో సమావేశమయ్యారు.
ఆ వెంటనే అక్కడి నుంచి రోడ్ల మీదకు ఫ్లకార్డులు పట్టుకుని చొచ్చుకొచ్చినట్లు గల్లియోట్ వెల్లడించారు.

కాగా, కొవిడ్ 19 తీవ్రత నేపథ్యంలో మెల్బోర్న్లో ఆరోసారి లాక్డౌన్ విధించారు.ఆగస్టు 6వ తేదీ నుంచి ఆరో లాక్డౌన్ కొనసాగుతోది.శనివారం కొత్తగా 535 కొవిడ్ కేసులు నమోదవ్వగా, 19 మంది మృతిచెందారు.
అటు లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్లోనూ ప్రజలు ఆందోళనలు నిర్వహించారు.