సెప్టెంబర్ 20న జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్ధులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఉజ్జల్ సింగ్, రణదీప్ ఎస్ సారాయ్, మణిందర్ సిద్దూ, రూబీ సహోటా, కమల్ ఖేరా, సోనియా సిద్దూ, నవదీప్ వంటి భారత సంతతి వ్యక్తులు వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచారు.
ఈ నేపథ్యంలో ఓ భారత సంతతి ఎంపీ విషయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో సారథ్యంలోని లిబరల్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజ్ షైనీని పోటీ నుంచి తప్పించారు.
అంటారియోలోని కిచనర్ సెంటర్ నుంచి బరిలో నిలిచిన ఆయన అభ్యర్ధిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లిబరల్ పార్టీ ప్రకటించింది.గడిచిన ఆరేళ్లుగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్ షైనీ మూడోసారి ఎంపీగా పోటీ చేసుందుకు సిద్ధమయ్యారు.
తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన షైనీ అనంతరం పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల ప్రారంభంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.
లైంగిక ఆరోపణల విషయంలో స్వయంగా కెనడా ప్రధాని కార్యాలయం రాజ్ షైనీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
భారత్లోని హిమాచల్ ప్రదేశ్ నుంచి కెనడాకు వలస వెళ్లిన రాజ్ షైనీ 2015 నుంచి కిచనర్ సెంటర్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.ఆయనపై తొలిసారిగా 2015 డిసెంబర్లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఒట్టావా కన్వెన్షన్ సెంటర్లో హాలీడే సమావేశానికి హాజరైన సమయంలో నలుగురు మహిళా సిబ్బంది పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఇది ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని భావించిన జస్టిన్ ట్రూడో రాజ్ షైనీని పోటి నుంచి తప్పించారు.

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన మరొ అభ్యర్ధిని సైతం లిబరల్ పార్టీ పోటీ నుంచి తప్పించింది.స్పాడినా- ఫోర్ట్ యార్క్ నుంచి పార్టీ నామినీగా వున్న కెవిన్ వూంగ్ 2019లో గుర్తు తెలియని మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నివేదిక అందింది.తొలుత ఈ కేసుకు సంబంధించి ఆయన కోర్టులో అభియోగాలు ఎదుర్కొన్నారు.అయితే 2019 నవంబర్లో దీనిని ప్రాసిక్యూటర్లు ఉపసంహరించుకున్నారు.కానీ మళ్లీ ఆ ఆరోపణలు రావడంతో వూంగ్ ఇబ్బందుల్లో పడ్డారు.సెప్టెంబర్ 16న ముందస్తుగా జరిగిన పోలింగ్లో లక్షలాది మంది ఓట్లు వేశారు.
లిబరల్ పార్టీ నిర్ణయంతో ఈ స్థానంలో ఎన్నికలు గందరగోళంలో పడ్డాయి.