ఏంటో జనాల మస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు … ఒకరిని ఎందుకు ఛీ కొడతారో మరొకరికి ఎందుకు జై కొడతారో ఎవరికీ తెలియదు.తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేరు చెబితే చాలు కారాలు మిరియాలు నూరుతూ… ఇష్టమొచ్చినట్టు ఆయన్ను తిట్టిపోసిన ఆంధ్రా జనాలు ఇప్పుడు ఆయన్ను ఓ హీరోలా చూస్తూ .
ఆయనకు మద్దతుగా ఆడు మగాడ్రా బుజ్జా ! అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.అంతేనా …? కేసీఆర్ ఫ్లెక్సీలు కు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.తెలంగాణాలో టీఆర్ఎస్ విజయం ఖాయం అవ్వగానే ఏపీలో కొంతమంది టీఆర్ఎస్ జెండాలు పట్టుకుని విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఏపీలో క్రమక్రమంగా కేసీఆర్ అభిమానులు పెరిగిపోతున్నారు.గుంటూరు, మాచర్ల, గుడివాడ, కోనసీమ.ఇలా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తో కూడిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలసి ఉందాం అనే భావన కు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.

అంతే కాదు… తెలంగాణాలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారాన్ని ఎదుర్కొని కేసీఆర్ విజయం సాధించడం సహజంగానే ఏపీలోని ప్రతిపక్షాలకు చాలా సంతోషాన్నిచ్చింది.అందుకే కేసీఆర్ ను, హరీశ్ రావును అభినందిస్తూ ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు.వీరిలో ఎక్కువగా… వైసీపీ , జనసేన పార్టీలకు చెందినవారే కనిపిస్తున్నారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన కోనసీమ ముఖ ద్వారంలో కేసీఆర్ ను ప్రశంసిస్తూ… ఆడు మగాడ్రా బుజ్జి అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇక చంద్రబాబు మీద ఒంటికాలి మీద లేస్తూ.ఏకవచనంతో… విమర్శలు చేసే వైసీపీ నాయకుడు … గుడివాడ ఎమ్యెల్యే కోడలి నాని కూడా కేసీఆర్ ను అభినందిస్తూ భారీ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు.జన హృదయనేత, ఓరుగల్లు విజేత అంటూ కేసీఆర్ ఫ్లెక్సీ వేయించారు.
ఈ పరిణామాలన్నిటిని గమనిస్తున్న టీడీపీ లోలోపల రగిలిపోతోంది.గోరు చుట్టుపై రోకలిపోటులా ఈ ఫ్లెక్సీలు టీడీపీ నాయకులకు ఇబ్బంది పెట్టేస్తున్నాయి.