తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు మామూలుగా లేవు.తమను పూర్తిగా టార్గెట్ చేసుకుని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ విషయంలో ఇక దూకుడుగా వెళ్లాలని,, కేవలం తెలంగాణలో మాత్రమే బీజేపీని అడ్డుకుంటే సరిపోదని, జాతీయ స్థాయిలో బీజేపీని అన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేయడం తో పాటు, రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి అధికారం దక్కకుండా చూడడమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఈ నెలలోనే ఢిల్లీ వెళ్లేందుకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు .ముఖ్యంగా బిజెపి, కాంగ్రెసేతర సీఎంలను కలవాలని, దేశవ్యాప్తంగా బిజెపి ని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలిసేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
దేశవ్యాప్తంగా బీజేపీ పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటం, ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతుండడం, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనం కావడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు కేసీఆర్. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.
దీనిపైన జాతీయస్థాయిలో పోరాడేందుకు , ప్రాంతీయ పార్టీలన్నిటిని ఏకం చేసుకుని ఉద్యమాలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇప్పటికే ప్రాంతీయ పార్టీల విషయంలో కేంద్రం కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని తరచుగా టిఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

ఇటీవల టిఆర్ఎస్ కు చెందిన ఎంపీలు , మంత్రులు రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఢిల్లీకి వెళ్ళినా కేంద్ర బీజేపీ పెద్దలు పట్టించుకోకపోవడం, అలాగే కేంద్ర మంత్రి పియుష్ గోయల్ అవమానించే విధంగా వ్యవహరించడాన్ని కెసిఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.అందుకే బీజేపీ వైఖరిని ఎండగట్టెందుకు జాతీయ స్థాయిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఇటీవల కేసీఆర్ తమిళనాడు కి వెళ్లారు.అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు.ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు.ఇదే విధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా వారి మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి పెట్టే ఆలోచనలో ఉన్నారు.

శివసేన, ఎన్సీపీ తదితర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.ఒకపక్క తృణమూల్ కాంగ్రెస్ ను జాతీయస్థాయిలో బలోపేతం చేస్తూనే, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపు వెళ్లేందుకు మమత ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో ఫోకస్ అవుతుండడం, బీజేపీ కి వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది
.