తెలంగాణలో కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో మోదీ పర్యటనతోనే ఈ కార్యక్రమాన్ని బీజేపీ షురూ చేయబోతోంది.
ఈ వేటను కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోనే బీజేపీ ప్రారంభించనుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ తొలితరం రాజకీయ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసి ఒక జిల్లాకే ఆయన పేరు పెట్టేంత ఘనత పొందిన కొండా వెంకట రంగారెడ్డి మనవడు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరే ముహూర్తం దాదాపుగా ఖరారైంది.
ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా జూలై 3న బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ సభా వేదికపైనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గతంలో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
కేసీఆర్‌తో విభేదాల కారణంగా 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే ఆయన అక్కడ ఇమడలేకపోయారు.దీంతో ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశారు.
ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా కాలంగా సరైన పార్టీ కోసం వెతుకులాటలో ఉన్నారు.
నిజానికి మాజీ మంత్రి ఈటెల రాజెందర్‌తో పాటే ఆయన బీజేపీలో చేరాలి.కానీ ఇపుడు టైమ్ వచ్చిందని కొండా భావిస్తున్నారు.రంగారెడ్డి జిల్లా ప్రజల్లో ఇప్పటికీ కొండా కుటుంబం పట్ల ఆదరణ కనిపిస్తోంది.

పారిశ్రామిక వేత్తగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మంచి పేరుంది.అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య.పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు అమెరికా పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ కావడాన్ని గొప్పగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పుకుంటారు.
ఇలా అన్ని విధాలుగా కొండా ప్రొఫైల్ గురించి ఆలోచించాకే ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే మైలేజ్ వస్తుందని బీజేపీ నిర్ణయించుకుంది.