ప్రశాంతకు మారుపేరైన న్యూజీలాండ్‌పై మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.అక్లాండ్‌లో వున్న సూపర్ మార్కెట్‌లోకి చొరబడిన ఉగ్రవాది.
ఆరుగురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.అయితే అత్యంత వేగంగా స్పందించిన భద్రత బలగాలు అతనిని కేవలం 60 సెకన్లలోపే హతమార్చినట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు.
సదరు ఉగ్రవాదిని శ్రీలంకకు చెందిన ఐఎస్ఐఎస్ ప్రేరేపిత వ్యక్తిగా గుర్తించారు.అతను 2011లో న్యూజిలాండ్‌కు వచ్చాడని, 2016 నుంచి అతనిపై జాతీయ భద్రతా దళం నిఘా పెట్టినట్లు ప్రధాని చెప్పారు.
ఆ ఉన్మాది భావజాలం విపరీతంగా ఉన్న నేపథ్యంలో అతనిపై నిఘా పెట్టినట్లు జెసిండా తెలిపారు.ఈ రోజు ఘటనలో ఆ ఉగ్రవాది సూపర్‌మార్కెట్‌లో బీభత్సం సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రజలు ప్రాణభయంతో ఆ మార్కెట్ నుంచి అటూ ఇటూ పరుగులు తీశారని వారు వెల్లడించారు.ప్రశాంతంగా వున్న వాతావరణం క్షణాల్లో అరుపులు, కేకలతో భీతావహంగా మారినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
న్యూ లిన్ ప్రాంతంలో ఉన్న లిన్‌మాల్ నుంచి జనం భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.ఉగ్రవాది దాడిలో గాయపడిన ఆరుగుర్ని భద్రతా దళాలు ఆసుపత్రికి తరలించాయి.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.
ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్న ఆ ఉన్మాదికి ఇటీవల 12 నెలల శిక్ష పడింది.
అభ్యంతరకర వస్తువులను కలిగి ఉన్న కేసులో ఆ శిక్షను విధించారు.అయితే కేవలం తాను ముస్లింను కావడం వల్లే వేధిస్తున్నట్లు ఆ వ్యక్తి కోర్టులో చెప్పాడు.
ఇదే సమయంలో ఆ వ్యక్తి ఇంటర్నెట్ సెర్చింగ్ హిస్టరీని పోలీసులు పరిశీలించారు.ఈ సందర్భంగా అతను ఎక్కువగా ఇస్లామిక్ స్టేట్ గురించి శోధించినట్లు తెలిసింది.
వాళ్లు ధరించే దస్తులు, జెండాలు, వాడే ఆయుధాలు, ఇస్లామిక్ హీరోలు ఎవరన్న దానిపై సెర్చ్ చేసినట్లు కూడా తెలిసింది.

కాగా 2019లో న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 51 మందిని ఉన్మాది పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.రెండు మసీదులపై జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి.ఈ దాడి తర్వాత న్యూజీలాండ్‌లో తుపాకీ వినియోగ చట్టాలను చాలా కఠినతరం చేశారు.