అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతి మహిళ దుర్మరణం పాలైంది.ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమార్తె పరిస్ధితి విషమంగా వుంది.
వివరాల్లోకి వెళితే.అమెరికాలో స్థిరపడిన రోమా గుప్తా (63), ఆమె కుమార్తె రీవా గుప్తా (33)లు ఆదివారం ఓ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు.
ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న విమానం న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ఐల్యాండ్ హోమ్స్ సమీపంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది.రిపబ్లిక్ ఎయిర్‌పోర్టుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని రోమా ప్రాణాలు కోల్పోగా.రీవా , ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ (23) తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసి.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.
ప్రస్తుతం రీవా, పైలట్ ఇన్స్ట్రక్టర్లు స్టానో బ్రూక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రీవా గుప్తా మౌంట్ సినాయ్ సిస్టమ్‌లో ఫిజిషీయన్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.
ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సైతం దర్యాప్తు ప్రారంభించింది.

అయితే విమానం కూలిపోవడానికి ముందు కాక్‌పీట్ నుంచి పొగలు వస్తున్నట్లు పైలట్ నివేదించినట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది.సౌత్ షోర్ బీచ్‌ల మీదుగా విమానం వెళ్లినట్లు ఫ్లైట్ డేటా చూపిస్తోందని మీడియా పేర్కొంది.ఈ నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విమాన శకలాలను తొలగించి విశ్లేషణ చేయనున్నారు.

కాగా.ప్రమాదానికి కారణమైన విమానం డానీ వైజ్మాన్ ఫ్లైట్ స్కూల్దిగా తెలుస్తోంది.దీనిపై ఆ సంస్థకు చెందిన న్యాయవాది ఒలేహ్ డెకైలో మీడియాతో మాట్లాడారు.పైలట్‌కు అనుభవం, నైపుణ్యం వున్నాయని చెప్పారు.ప్రమాదానికి గురైన విమానానికి రెండు వారాల క్రితమే కఠినమైన తనిఖీలు సైతం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.భద్రతాపరమైన తనిఖీల్లో ఎలాంటి లోపం బయటపడలేదని ఒలేహ్ తెలిపారు.