ప్రతిరోజూ లక్షల్లో కేసులు.వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌ల క్యూలు, ఆగకుండా మండుతున్న ఎలక్ట్రిక్ దహన వాటికలు.
ఇవి గతేడాది అమెరికాలో కనిపించిన పరిస్ధితులు.కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని.
అది మామూలు జ్వరమేనంటూ ట్రంప్ లైట్‌గా తీసుకోవడంతో తానెంత డేంజరో కోవిడ్ రుచి చూపింది.చూస్తుండగానే చాప కింద నీరులా దేశం మొత్తం వైరస్ వ్యాపించింది.
జనం పిట్టల్లా రాలిపోవడంతో పాటు లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.ఈ భూమ్మీద కోవిడ్‌తో తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుందంటే అది అమెరికాయే.
ఆ పరిస్ధితి చూస్తే.అగ్రరాజ్యంలో చివరికి ఎంతమంది మిగులుతారోనంటూ కామెంట్లు వినిపించాయి.
కానీ క్రమంగా పరిస్దితులు మెరుగుపడ్డాయి.
అయితే ఆర్ధిక పరిస్ధితి మాత్రం అస్తవ్యస్తంగా మారింది.
ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.ఇలాంటి వారిని ఆదుకోవడానికి మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌లు రిలీఫ్ ఫండ్‌లు ప్రకటించారు.
ముఖ్యంగా జో బైడెన్ ఈ ప్యాకేజ్‌ను భారీగా పెంచారు.ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ బిల్లుకు కొద్దినెలల క్రితం సెనేట్, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపగా, బైడెన్ సంతకంతో చట్టంగా మారింది.
దీంతో ఈ ప్యాకేజ్ ఫలాలను ప్రజలకు పంచడం ప్రారంభించింది ఫెడరల్ ప్రభుత్వం.దీని ద్వారా సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందుతోంది.
ఏడాదికి 75 వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు (సుమారు రూ.లక్ష) జమ చేయనున్నారు.దీనిలో భాగంగా మార్చి 14 నుంచి 1400 డాలర్ల పంపిణీని ప్రారంభించినట్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) వెల్లడించింది.
అయితే ప్రభుత్వం సదుద్దేశంతో చేస్తున్న పనిని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు.
ఈ క్రమంలో భారత సంతతికి చెందిన ఓ టెక్కీ.కోవిడ్ పేరిట మోసపూరితంగా 1.8 మిలియన్ డాలర్ల రుణం పొందాడు.ఈ కేసులో నేరం రుజువుకావడంతో న్యాయస్థానం అతనికి రెండేళ్ల జైలుశిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే.ముకుంద్ మోహన్ అనే 48 ఏళ్ల ఇండో అమెరికన్‌పై న్యాయశాఖ మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 15న ఆయనపై పలు అభియోగాలు మోపింది.మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లలో పనిచేసిన అతను సొంతంగా పలు కంపెనీలు సైతం ప్రారంభించాడు.అయితే కోవిడ్ సంక్షోభ కాలంలో తీవ్ర ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం ప్రకటించిన పేచెక్ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్ ద్వారా మోసపూరితంగా రుణాలను పొందాడు.ఇందుకు గాను మోహన్ నకిలీ పత్రాలను సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.
మొత్తంగా 5.5 మిలియన్ డాలర్ల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మోహన్.జూలై 2020లో 1.8 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అందుకున్నాడు.ఈ కేసులో అభియోగాలు రుజువుకావడంతో మంగళవారం వాషింగ్టన్ పశ్చిమ జిల్లా కోర్టు మోహన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.జైలు శిక్షతో పాటు 1,00,000 డాలర్ల జరిమానా అలాగే ప్రభుత్వానికి 17,86,357 డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని మోహన్‌ను కోర్టు ఆదేశించింది.