విక్రమార్కుడి అని చెప్పగానే అందరికి చటుక్కున గుర్తొచ్చేది పట్టువదలని దీక్ష.బేతాళుడి విషయంలో విక్రమార్కుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇప్పుడు మనం ఇలాంటి ఓ ఎన్నారై గురించే చర్చించుకోబోతున్నాం.అబుదాబి లో ఉంటున్న భారత సంతతి వ్యక్తి అబూ మహ్మద్ ఓ షిప్పింగ్ కంపెనీలో ఆపరేషన్స్ కొ ఆర్డినేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
గత కొన్నేళ్లుగా అక్కడి అబుదాబి బిగ్ టిక్కెట్ డ్యూటీ ఫ్రీ లాటరీలో టిక్కెట్లు కొనుగోలు చేస్తూ ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటున్నాడు.అయితే
డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ లాటరీలో ఒక్కసారి కూడా అదృష్టం వరించలేదు.
తనతో పాటు తన స్నేహితులతో కలిసి లాటరీలు కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు.ఇలా ఏళ్ళు గడుస్తున్నా ఫలితం లేకపోయినా నిరాస చెందకుండా పట్టువదలకుండా లాటరీలు కొనుగోలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆగస్టు 30 న తన స్నేహితులతో కలిసి మరో సారి తన అదృష్టం పరీక్షించుకోవాలని భావించాడు.అబుదాబి బిగ్ టిక్కెట్ డ్యూటీ ఫ్రీ లాటరీ కొనుగోలు చేశాడు.
ఈ సారి కూడా నిరాశ ఎదురవుతుందేమోనని భావించిన మహ్మద్ ను ఊహించని విధంగా అదృష్టం వరించింది.
ఈనెల 3 వ తేదీన నిర్వహించిన లాటరీలో మహ్మద్ తన మిత్రులు కలిసి కొనుగోలు చేసిన టిక్కెట్ నెంబర్ – 027700 కు కళ్ళు చెదిరే భారీ మొత్తం గెలుచుకున్నారు.దాదాపు 12 మిలియన్ దిర్హమ్స్ అంటే భారత కరన్సీలో అక్షరాలా రూ.24 కోట్లు గెలుచుకున్నారు.ఈ ఊహించని పరిమాణంతో మహ్మద్ ఆయన స్నేహితులు ఉబ్బితబ్బిబ్బై పోయారు.ఈ బిగ్ టిక్కెట్ లాటరీలో తమకు ఎన్ని సార్లు నిరాశ ఎదురైనా సరే ఎప్పటికైనా అదృష్టం వరిస్తుందని ప్రయత్నిస్తూనే ఉన్నాం.
ఇన్నాళ్ళకు మా నిరీక్షణ ఫలించింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.