కరోనా వైరస్ సోకిన వారిలో అధిక మరణాలు సంభవించడానికి కారణం ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడమే.మార్చి నుంచి మే చివరి వరకు మనదేశాన్ని వణికించిన సెకండ్ వేవ్‌లో ఈ సమస్య వల్లే భారత్‌లో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి.
కరోనా మహమ్మారి సోకడం కన్నా ప్రాణవాయువు కొరతే ఊపిరి తీసేస్తోంది.కరోనా రోగులకు కావాల్సిన ఆక్సిజన్ మామూలు వాతావరణంలో దొరకదు.మెడికల్ ఆక్సిజనే అత్యవసరం.93 శాతానికి పైగా శుద్ధిచేసిన ఆక్సిజన్‌ను ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి రోగులకు అందిస్తారు.
అయితే కొవిడ్ సోకిన 90 శాతానికి పైగా రోగుల్లో తీవ్ర, మధ్యస్థ లక్షణాలు కలిగి ఉంటారు.వారిలో హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు 7 నుంచి 10 రోజులు తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా లక్షణాలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే వీరిలో 10శాతం కన్నా తక్కువ మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుంది.లక్షణాల తీవ్రత, వారికున్న దీర్ఘకాలిక వ్యాధులను బట్టి ఎంత ఆక్సిజన్ వాడాలి?ఏ రూపంలో వాడాలి? అనేది వైద్యులు నిర్ణయిస్తారు.రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆక్సిజన్ ఏవిధంగా అందించాలో వైద్యులు సూచిస్తారు.5 నుంచి 10 శాతం పేషెంట్లకు ఎన్‌ఐవి సపోర్టు కానీ, హైఫ్లో నాజల్ క్యానులా, మెకానికల్ వెంటిలేటర్ అవసరం అవుతాయి.
రోగి రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నా, కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు ఎక్కువగా ఉన్నా, ఆయాసం ఎక్కువైనా, అపస్మారక స్థితిలో ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా వైద్యులు తక్షణం వెంటిలేటర్‌ను అమర్చుతారు.ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టాన్ని అమర్చి దాన్ని వెంటిలేటర్ పరికరం ట్యూబులతో కలుపుతారు.
అయితే అత్యంత క్లిష్టమైన ఈ దశలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వుండాలి.రోగికి వెంటిలేటర్ అవసరం పడుతుందని ముందే గ్రహించ గలగాలి.
కానీ అది అంత తేలిక కాదు.ఈ క్రమంలో అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన పరిశోధకులు.
కోవిడ్ సోకిన రోగికి వెంటిలేటర్ అవసరమవుతుందో లేదో ముందే తెలుసుకునే సాధనాన్ని ఆవిష్కరించారు.కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులచే ఈ సాధనం అభివృద్ది చేయబడింది.2020లో అమెరికా, చైనాలోని వుహాన్‌ల నుంచి దాదాపు 900 మంది రోగుల నుంచి సేకరించిన సీటీ స్కాన్‌లను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు ఈ సాధనాన్ని రూపొందించారు.ఇందుకు వారు అర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన రోగులకు ఈ సాధనం ద్వారా వెంటిలేటర్ అవసరమయ్యే లక్షణాలను ఈ సాధనం ముందే గుర్తించిందని పరిశోధకులు తెలిపారు.ఇది 84 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు వారు వెల్లడించారు.

ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన ఆమోఘ్ హిరేమత్ అనే శాస్త్రవేత్త పాల్గొన్నారు.ఈ సాధనం ద్వారా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ – లేదా ప్రాణాపాయం ఉన్నవారిని ముందుగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు.ఆయనతో పాటు కేస్ వెస్ట్రన్ రిజర్వ్‌లోని డోనెల్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ , సెంటర్ ఫర్ కంప్యూటేషనల్ ఇమేజింగ్ అండ్ పర్సనలైజ్డ్ డయాగ్నోస్టిక్స్ అనంత్ మాడభూషి కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు.కోవిడ్ రోగుల కోసం ఈ సాధానాన్ని యూనివర్సిటీ హాస్పిటల్స్, లాయిస్ స్టోక్స్ క్లీవ్ ల్యాండ్ వీఏ మెడికల్ సెంటర్‌లో ఉపయోగించాలని పరిశోధకులు భావిస్తున్నారు.