మరికొద్దిరోజుల్లో కెనడాలో ఫెడరల్ ఎన్నికలు జరుగుతున్న వేళ భారత సంతతికి చెందిన ఎంపీ ఒకరు చిక్కుల్లో పడ్డారు.మహిళా సిబ్బందిపై గడిచిన ఆరేళ్లుగా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపఱణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన వాటిని ఖండించారు.ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ నేత, ఎంపీ రాజ్ షైనీ ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
గడిచిన ఆరేళ్లుగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన మూడోసారి ఎంపీగా పోటీ చేసుందుకు సిద్ధమయ్యారు.నైరుతి అంటారియో స్థానం నుంచి పార్టీ షైనీకి టికెట్ కేటాయించింది.
లైంగిక ఆరోపణల విషయంలో స్వయంగా కెనడా ప్రధాని కార్యాలయం రాజ్ షైనీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్ నుంచి కెనడాకు వలస వెళ్లిన రాజ్ షైనీ 2015 నుంచి కిచనర్ సెంటర్ రైడింగ్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
ఆయనపై తొలిసారిగా 2015 డిసెంబర్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఒట్టావా కన్వెన్షన్ సెంటర్‌లో హాలీడే సమావేశానికి హాజరైన సమయంలో నలుగురు మహిళా సిబ్బంది పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
కాగా, సెప్టెంబర్ 20న జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికల్లో పలువురు భారతీయులు బరిలో నిలిచారు.గత వారాంతంలో న్యూబ్రన్స్‌విక్ ప్రావిన్స్‌లో జరిగిన ప్రచారంలో కెనడా ప్రధాని ట్రూడో తనతో పాటు భారత సంతతి మంత్రి అనితా ఆనంద్‌ను ప్రచారానికి తీసుకెళ్లారు.
ఆమె ఒంటారియోలోని ఓక్విల్లే నుంచి మరోసారి ఎన్నికయ్యేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు.అలాగే ఒంటారియోలోని వాటర్లూ రైడింగ్ నుంచి 2015 నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న బర్దిస్ చాగర్ కూడా మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఇక ట్రూడో కేబినెట్‌లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న హర్జిత్ సజ్జన్ కూడా వాంకోవర్ సౌత్ నుంచి మరోసారి ఎంపీగా గెలవాలని ఊవ్విళ్లూరుతున్నారు.ఈ జిల్లా జనాభాలో భారతీయులు అధిక సంఖ్యలో వున్నారు.
అయితే ఇదే స్థానం నుంచి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సుఖ్‌బీర్‌సింగ్ గిల్ కూడా భారత సంతతికి చెందిన వారే కావడంతో ఇక్కడ పోటీ ఆసక్తిగా మారే అవకాశం వుంది.

2019 బ్రిటీష్ కొలంబియాలోని బర్నాబీ సౌత్ గెలిచిన న్యూడెమొక్రాటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్ ఈ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.2019 ఫెడరల్ ఎన్నికల్లో సింగ్ నాయకత్వంలోని న్యూడెమొక్రాట్లు 24 సీట్లను గెలుచుకుని సత్తా చాటారు.ఇదే సమయంలో ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచిన జగ్మీత్ సింగ్ కింగ్‌మేకర్‌గా అవతరించారు.
మరోసారి ఇదే రిపీట్ అవుతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి.
వీరితో పాటు ఉజ్జల్ సింగ్, రణదీప్ ఎస్ సారాయ్, మణిందర్ సిద్దూ, రూబీ సహోటా, కమల్ ఖేరా, సోనియా సిద్దూ, నవదీప్ వంటి భారత సంతతి వ్యక్తులు కూడా మరోసారి బరిలో నిలిచారు.