6 బంతుల్లో 6 సిక్సర్లు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే వ్యక్తి.టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సిక్సర్ల మోత మోగించాడు.ఒకే ఓవర్లో ఆరు బంతులను బౌండరి దాటించి అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
ఆ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను చాలా మందే బాదారు.విండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్, శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టారు.
ఐపీఎల్ 14వ సీజన్లో రవీంద్ర జడేజా తృటిలో రికార్డును మిస్ అయ్యాడు.అయితే తొలిసారి ఈ ఫీట్ సాధించింది మాత్రం యువరాజే.తాజాగా భారత సంతతికి చెందిన ఓ క్రికెటర్ ఈ ఘనత అందుకున్నాడు.
ఓమన్ వేదికగా పపువా న్యూగినియా, అమెరికా జట్లు అంతర్జాతీయ వన్డేలో తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.అమెరికా ఆటగాళ్లు అంతా విఫలమైనా.భారత సంతతికి చెందిన జస్కరన్ మల్హోత్రా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.పపువా న్యూగినియా బౌలర్లను ఊచకోత కోశాడు.124 బంతుల్లో 173 పరుగులు చేశాడు.మల్హోత్రా ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఫోర్లు మాత్రమే బాదగా.
ఏకంగా 16 సిక్సులు కొట్టాడు.బౌండరీల ద్వారానే 100కు పైగా పరుగులు చేశాడంటే అతని విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే పపువా న్యూగినియా పేసర్ గౌడి టోకా వేసిన 50వ ఓవర్లో ఆరు బంతులను మల్హోత్రా లాంగాన్, ఎక్స్ట్రా కవర్, లాంగాఫ్ వైపుగా ఆరు సిక్సర్లు బాది అంతర్జాతీయ వన్డేలో రికార్డు నెలకొల్పాడు.అమెరికా క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
అంతేకాకుండా అమెరికా క్రికెట్ జట్టుకు వన్డే హోదా వచ్చిన తర్వాత సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా మల్హోత్రా రికార్డుల్లోకెక్కాడు.గతంలో 2019లో యూఏఈ వేదికగా జరిగిన వన్డేలో అరోన్ జాన్స్(95) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్లతో 173 పరుగులతో అజేయంగా నిలిచి వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మోర్గాన్ (17) తర్వాతి స్థానంలో నిలిచాడు.అంతేకాదు ఈ ఫీట్ తో డివిలియర్స్ రికార్డ్ బ్రేక్ చేశాడు మల్హోత్రా.ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు.అన్నట్లు ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
చండీగఢ్‌లో పుట్టిన జస్కరన్ అనంతరం అమెరికాకు వలస వెళ్లి.ఆ దేశ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.