2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వుండగానే.అప్పుడే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.
ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రముఖులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ట్రంప్ మరోసారి పోటీ చేయాలని గట్టి పట్టుదలగా వున్నారు.ఈయనతో పాటు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సైతం పోటీకి సైతం అంటున్నారు.
ఈ క్రమంలో ఆమె తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా చేయడానికి మరింత చేరువవుతున్నారు.ఈరోజు నిక్కీ హేలీ మద్ధతుదారులు ఫిబ్రవరి 15న చార్లెస్టన్‌లో జరిగే లాంచ్ ఈవెంట్‌కు ఈమెయిల్ ద్వారా ఆహ్వానాన్ని అందుకోనున్నారు.
ఈ సందర్భంగా నిక్కీ హేలీ తన ప్రచారాన్ని ప్రకటించాలని యోచిస్తున్నారు.హేలీ ఎన్నికల్లో పోటీ చేసే విషయానికి సంబంధించి తొలిసారిగా పోస్ట్ అండ్ కొరియర్ ఆఫ్ చార్లెస్టన్ బహిర్గతం చేసింది.
ఇదిలావుండగా.హేలీ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన హెన్రీ మెక్‌మాస్టర్‌తో కలిసి 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార ప్రారంభం కోసం శనివారం సౌత్ కరోలినాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే 2024 ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ బరిలోకి దిగితే.మద్ధతుగా వుంటాను కానీ ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయనని 2021లోనే నిక్కీ హేలీ తేల్చిచెప్పారు.
దీని గురించి అవసరమైతే ట్రంప్‌తో మాట్లాడతానని హేలీ స్పష్టం చేశారు.కాగా, జనవరి 6న జరిగిన క్యాపిటల్ దాడి నేపథ్యంలో మాత్రం ఆమె ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.

క్యాపిటల్ భవనంపైకి దాడి చేసేలా ప్రేరేపించిన ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.ఆయన ఎప్పుడూ సరైన పదాలను ఉపయోగించలేదని.మాజీ అధ్యక్షుడి చర్యలను చరిత్ర కఠినంగా పరిగణిస్తుందని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా బ్లాక్ చేస్తూ ట్విట్టర్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నిక్కీ హేలీ ఖండించారు.
భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌కు చెందిన నిక్కీహేలీ అసలు పేరు నమ్రతా నిక్కీ రణధవా.ఆమె తల్లిదండ్రులు అజిత్ సింగ్, రాజ్‌కౌర్.క్లెమ్సన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్న నిక్కీ హేలీ.ఎఫ్‌సీఆర్ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేశారు.1996లో మిచెల్ హేలీని పెళ్లాడిన ఆమె.రాజకీయాల్లో చురుకుగా వుండేవారు.దక్షిణ కరొలినా గవర్నర్ గా రెండు సార్లు పనిచేసి సంచలనం సృష్టించారు.

అంతే కాకుండా దక్షిణ కరోలినాకు తొలి మహిళా గవర్నరుగా నిక్కీ రికార్డుల్లోకెక్కారు.ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తించారు.తాను భారత్ నుంచి వచ్చిన వలసదారుల అమ్మాయినని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని నిక్కీ హేలీ పలు సందర్భాల్లో చెప్పారు.
తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చి, చిన్న పట్టణంలో స్థిరపడ్డారని… తన తండ్రి టర్బన్ ధరిస్తారని, తన తల్లి ఇప్పటికీ చీర కట్టుకుంటారని తెలిపారు.తన తల్లి విజయవంతమైన వ్యాపారస్తురాలిగా నిలిచారని, తన తండ్రి నల్లవారి కాలేజీగా పేరున్న చోట, 30 ఏళ్లు పాఠాలు చెప్పారని నిక్కీ హేలీ వెల్లడించారు.
సౌత్ కరోలినా ప్రజలు, తొలి మైనారిటీ, తొలి మహిళగా గవర్నర్ గా తనను ఎన్నుకుని ఘనమైన గౌరవాన్ని ఇచ్చారని తరచుగా చెప్పేవారు.