భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మనదేశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఏప్రిల్‌తో మొదలైన ఈ ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
అయితే మనదేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఒక్కొక్క దేశం నిషేధాన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి.అమెరికా, బ్రిటన్, యూఏఈలు నిషేధాన్ని ఎత్తివేసిన జాబితాలో వున్నాయి.
దీంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక అమెరికా, బ్రిటన్ తర్వాత భారతీయులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లే కెనడా మాత్రం విమానాలపై బ్యాన్ ఇంకా కొనసాగిస్తూనే వుంది.
భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని గతంలో ప్రకటించింది.ఆంక్షలు విధించినప్పటికీ కెనడా.
భారతీయులకు చిన్న వెసులుబాటు కల్పించింది.అదేంటంటే.
‘థర్డ్ కంట్రీ’ ద్వారా భారత్ నుంచి ప్రయాణికులు కెనడా రావొచ్చని తెలిపింది.ఇందుకోసం ప్రయాణికులు మరో దేశంలో దిగి అక్కడ కరోనా టెస్టులు చేయించుకోవాలి.
అనంతరం అక్కడే రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.ఆ తర్వాత కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్‌తో కెనడాకు రావొచ్చని వెల్లడించింది.
అయితే కెనడా విధించిన నిషేధం సెప్టెంబర్ 21తో ముగియడంతో గత మంగళవారం భారత్ నుంచి వచ్చే అన్ని ప్రత్యక్ష, వాణిజ్య, ప్రైవేటు ప్యాసింజర్ విమానాలపై ఆదివారం (సెప్టెంబర్ 26) వరకు నిషేధాన్ని పొడిగించింది.గడువు నిన్నటితో ముగియనున్న నేపథ్యంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ప్రకటించింది.మెరుగైన కొవిడ్ ప్రోటోకాల్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
సోమవారం నుంచి ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది.

అయితే, నిషేధం ఎత్తివేస్తూనే కెనడా ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది.కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.భారతీయ ప్రయాణికులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కెనడా ఆమోదించిన జెన్‌స్ట్రింగ్ ల్యాబ్ నుంచి కొవిడ్ టెస్ట్ (మాలిక్యులర్) చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇందులో నెగెటివ్ వస్తేనే ప్రయాణానికి అనుమతి ఇస్తారు.కెనడా ప్రయాణానికి 18 గంటల ముందు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కాకుండా భారత్‌లోని ఇతర ల్యాబ్‌ల్లో తీసుకున్న కొవిడ్ టెస్ట్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోమని కెనడా ప్రభుత్వం తేల్చిచెప్పింది.ట్రూడో ప్రభుత్వ నిర్ణయంతో నెలల తరబడి కెనడా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న పలువురు భారతీయులు, ఇండో కెనడియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.