కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణీకులు, విమాన రాకపోకలపై ఎన్నో దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.అయితే పరిస్ధితులు కుదుటపడుతుండటంతో ఒక్కో దేశం ఆంక్షలను సడలిస్తూ వస్తోంది.
మొన్న యూఏఈ ఈ రకమైన ఆంక్షలను ఎత్తివేయగా.తాజాగా ఈ లిస్ట్‌లో బ్రిటన్ కూడా చేరింది.
ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడినందున రెడ్‌లిస్ట్ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్‌లో చేర్చింది.ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
దీంతో భారతీయులు పెద్ద సంఖ్యలో యూకే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ పరిస్ధితుల్లో యూకే ప్రభుత్వం భారతీయులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.
కొత్త ట్రావెల్ రూల్స్ ప్రకారం.రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న భారతీయులను యూకేలో టీకాలు వేయించుకోని వారిగానే పరిగణించబడతారని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాకుండా దేశంలో అడుగుపెట్టిన భారతీయులు తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాలని తేల్చిచెప్పింది.

దీంతో యూకే ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కోవిషీల్డ్ టీకాను ఆ దేశ ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా వుందన్నారు.వాస్తవానికి ఈ టీకా యూకేకు చెందినదేనని.
ఆస్ట్రాజెనెకా తయారు చేసిన ఫార్ములా ఆధారంగానే పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ టీకాలు ఉత్పత్తి చేసి బ్రిటన్‌కు సైతం ఎగుమతి చేసిందని గుర్తుచేశారు.ఇది ముమ్మాటికీ జాత్యహంకారమేనంటూ జైరాం రమేశ్ మండిపడ్డారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.ఒక వ్యక్తికి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూఏఈ, ఇండియా, టర్కీ, జోర్డాన్, థాయ్‌లాండ్, రష్యా వంటి దేశాలలో టీకాలు వేసినప్పటికీ వారిని టీకాలు పొందని వారిగానే చూస్తామని యూకే ప్రభుత్వం తెలిపింది.
తమ దేశంలోకి వచ్చే ఈ దేశాల ప్రజలు ఖచ్చితంగా పది రోజుల పాటు నిర్బంధ క్వారంటైన్‌లో వుండాలని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో యూకేకు రావాలనుకునే భారతీయుల కోసం ప్రత్యేకమైన నిబంధనలను విడుదల చేసింది.
దీని ప్రకారం.

* ఇంగ్లాండ్ ప్రయాణానికి మూడు రోజుల ముందు ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి * ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత 2వ రోజు, 8వ రోజు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని.ఇందుకోసం ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవడంతో పాటు రుసుము చెల్లించాలి.* ఇంగ్లాండ్ రావడానికి 48 గంటల ముందు ప్యాసింజర్ లోకేటర్ ఫాంను పూర్తి చేయాలి
ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత చేయాల్సినవి:
* ఇంట్లో లేదా నివసిస్తున్న ప్రదేశంలో ఖచ్చితంగా 10 రోజులు క్వారంటైన్‌లో వుండాలి * 2వ రోజు , 8వ రోజు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.