మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో బ్రిటన్ తరపున మన భారతీయ సైనికులు పలుదేశాలతో యుద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వివిధ దేశాలలలో భారతీయ జవాన్ల గౌరవార్ధం స్మృతి వనాలు నెలకొల్పారు.
ఇందులో ఒకటి ఇజ్రాయెల్‌లోని టాల్ఫియోట్‌లో వుంది.భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐదు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా టాల్ఫియోట్‌లో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు ఆర్పించిన భారతీయ సైనికులకు నివాళులర్పించారు.
ఆ నాటి యుద్ధంలో జెరూసలేం, రామ్లే, హైఫాతో పాటు ఇజ్రాయెల్‌లోని పలు ప్రదేశాలలో దాదాపు 900 మంది భారతీయ సైనికుల మృతదేహాలను ఖననం చేశారు.
భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ వచ్చారు జైశంకర్.
ఈ సందర్భంగా టాల్ఫియెట్‌లోని స్మశాన వాటికలో పుష్పగుచ్ఛం వుంచి నివాళులర్పించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్‌లో ధైర్యంగా పోరాడి.తమ సహచరులకు, మాతృదేశానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన భారత వీరులకు నివాళులర్పించడం తనకు చాలా గౌరవంగా వుందని జైశంకర్ విజిటర్స్ బుక్‌లో రాశారు.
ఈ వీరుల పరాక్రమం, ధైర్య సాహసాలు, త్యాగం భారతీయుల హృదయంలో ఎప్పటికీ నిలిచి వుంటుందని జైశంకర్ అన్నారు.అలాగే ఇజ్రాయెల్‌లో భారతీయ సైనికుల కోసం స్మారక చిహ్నాలను నిర్వహిస్తున్నందుకు కామన్‌వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్‌కు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.హైఫాను విముక్తి చేయడంలో తమ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతీయ అశ్వికదళ రెజిమెంట్లు మైసూర్, హైదరాబాద్, జోధ్‌పూర్ లాన్సర్స్ గౌరవార్థం .భారత సైన్యం ప్రతి ఏటా సెప్టెంబర్ 23న హైఫా దినోత్సవంగా జరుపుతున్న సంగతి తెలిసిందే.నాటి యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు గాను.
కెప్టెన్ అమన్ సింగ్ బహదూర్, దాఫాదర్ జోర్ సింగ్‌లకు ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్..
అలాగే కెప్టెన్ అనూప్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ సాగత్ సింగ్‌లకు మిలటరీ క్రాస్ అవార్డులు లభించాయి.ప్రధానంగా మేజర్ దల్పత్ సింగ్‌ను ఇక్కడి స్థానికులు ‘‘ హీరో ఆఫ్ హైఫా ’’గా పిలుచుకుంటారు.
నాటి యుద్ధంలో ఈటెలు, కత్తులతో భారతీయ అశ్వికదళ రెజిమెంట్లు శౌర్య పరాక్రమాలను ప్రదర్శించి కార్మెల్ పర్వతం వాలుల నుంచి శత్రువులను తరిమికొట్టాయి.
2017 జూలైలో ఇజ్రాయెల్ పర్యటన సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ హైఫా స్మశాన వాటికను సందర్శించారు.ఈ క్రమంలో నగర విముక్తిలో కీలకపాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించారు.స్వాతంత్య్రానంతరం అశ్వికదళ యూనిట్ల విలీనం తర్వాత .వీటిని 61వ అశ్విక దళంగా వ్యవహరిస్తున్నారు.దీని శతాబ్ధి ఉత్సవాలలో పాల్గొనడానికి 2018లో ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వం ఒక బృందాన్ని సైతం పంపింది.హైఫా నగరాన్ని విముక్తి చేయడంలో భారత సైనికుల పాత్రను ప్రశంసిస్తూ 2018లో ఇజ్రాయెల్ తపాల శాఖ ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
ఇక తాజా ఇజ్రాయెల్ పర్యటనలో .ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్, విదేశాంగ మంత్రి యైర్ లాపిడ్‌లతో జైశంకర్ భేటీకానున్నారు.