కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో చిన్న పిల్లలపై కోరలు చాస్తోంది.భారతదేశంలో గత ఏడాది మార్చి నెలలో విజృంభించిన కరోనా చివరి నెలల్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో విశ్వరూపం చూపిస్తోంది.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఈ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది.సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కొందరు కరోనా మహమ్మారి దాటికి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు.
పోయిన ఏడాది విజృంభించిన కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపలేదు.
పిల్లల్లో ఎటువంటి లక్షణాలూ కనిపించలేదు కానీ ఈ ఏడాదిలో వ్యాప్తి చెందుతున్న కరోనా ప్రధానంగా పిల్లల పైనే ప్రతాపం చూపుతోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది పాఠశాల విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడ్డారు.
వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయిందని తల్లిదండ్రులు భావించారు కానీ ఈ విధంగా కరోనా తమ పిల్లలకు సోకుతుందని ఎవరూ ఊహించలేదు.మార్చి నెల తొలివారంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులకు రెట్టింపు స్థాయిలో చివరివారంలో నమోదయ్యాయి.
అయితే కరోనా వైరస్ సోకిన వారందరిలో ఎక్కువగా పిల్లలే ఉంటున్నారు.

బెంగళూరు నగరంలో మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 472 మంది చిన్న పిల్లలు అనగా కేవలం పది సంవత్సరాల లోపు వయసున్న పిల్లలే కరోనా వైరస్ బారిన పడ్డారు.వారిలో 228 అమ్మాయిలు ఉన్నారు.అయితే ఒక్క రోజులోనే 46 మంది పిల్లలు కొవిడ్ -19 వ్యాధిగ్రస్తులు అయ్యారు.
పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా బయట తిరుగుతూ ఆటలు ఆడటం వల్ల వారికి కరోనా వైరస్ సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.కరోనా వ్యాప్తి తగ్గిపోయిందనే భావనలో ఉన్న పెద్దలు జన సమూహంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నారు.
వారి నుంచి పిల్లలకు.ఆ పిల్లల నుంచి మరికొంత మంది పిల్లలకు కరోనా వైరస్ సంక్రమించి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.
చిన్న పిల్లలకు కరోనా వైరస్ పై పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు కాబట్టి వారిని ఈ మహమ్మారి నుంచి కాపాడడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు.సెకండ్ వేవ్ తగ్గేంతవరకు చిన్న పిల్లలను ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడితే కరోనా సోకే ప్రమాదం ఏమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు.
ఈసారి చిన్న పిల్లలపై ప్రభావం పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.