కరోనా వైరస్ వలన దేశంలోని ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.తగ్గినట్టే తగ్గి మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అయిపొయింది.
ఈ క్రమంలో హోలీ పండగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాలు అక్కడ ప్రజలకు ఆంక్షలు విధించాయి.హోలీ పండగ వాతావరణంలో ప్రజలు అందరు ఒకే చోట గుమిగూడితే కరోనా వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టం అవుతుంది అని అన్ని రాష్ట్రాల పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నాయి.
అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా హోలీ పండగ సందర్భంగా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.ఈ క్రమంలో చాలా మంది ప్రజలు పండగ జరుపుకోకుండా ఇంటికే పరిమితం అయ్యారు.
కానీ ఉజ్జయినికి చెందిన ఐదుగురు వైద్య విద్యార్థులు మాత్రం ఒక సరికొత్త రీతిలో హోలీ పండుగను జరుపుకున్నారు.కరోనా వైరస్ వ్యాప్తి, తీసుకోవాలిసిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేలాగా ఈ విద్యార్థులంతా పీపీఈ కిట్లు ధరించారు.
వీటితో పాటు ప్రత్యేకంగా తయారుచేసిన మాస్కులు కూడా ధరించి సంబరాలు చేసుకున్నారు.ఉజ్జయిని లోని ఫ్రీగంజ్ ప్రాంతంలోని వైద్య విద్యార్థులు అంతా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి ఒకరికొకరు రంగులు పూసుకుని సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.
అంతేకాకుండా అటుగా వెళ్లేవారికి హోలీ పండగ శుభాకాంక్షలు కూడా తెలపడంతో పాటు వారితో హోలీ కూడా ఆడారు.కరోనా వైరస్ ను లెక్కచేయకుండా జాగ్రత్తలు పాటించని వారికి మాస్కులు ధరించాలని, కరోనా వైరస్ ని తరిమి కొట్టాలని సూచనలు కూడా చేశారు.హోలీ పండగను సురక్షితంగా ఎలా జరపాలి అనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మేము ఈ రకంగా హోలీ పండుగ జరుపుకున్నామని విద్యార్థులు వెల్లడించారు.ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వైద్య విద్యార్థులు చేసిన ఈ పనిని అందరు మెచ్చుకుంటున్నారు.