దక్షిణ కాలిఫోర్నియాలో( South California ) జంతువులు వాహనాలపై దాడులు చేస్తున్నాయని వార్త చాలామందికి ఆందోళన కలిగించింది.ఇవి తమపై కూడా దాడి చేస్తాయేమో అని అక్కడి ప్రజలు భయపడ్డారు కూడా.
కానీ నిజానికి అసలు అక్కడ ఎలాంటి జంతువులు తిరగడం ఏ వాహనాలను ధ్వంసం చేయడం లేదని తెలిసింది.నలుగురు వ్యక్తులు బీమా కంపెనీలను మోసం చేయాలనే ఇలా జంతువుల్లాగా వేషం వేసుకొని తమ కార్లను డామేజ్ చేసుకున్నారు.
కాలిఫోర్నియా ఇన్సూరెన్స్ శాఖ (CDI) నిర్వహించిన ‘ఆపరేషన్ బేర్ క్లా’( Operation Bear Claw ) అనే విచారణలో, ఈ నలుగురు వ్యక్తులు తమ ఖరీదైన కార్లపై ఎలుగుబంటి దాడి( Bear Attacks ) జరిగినట్లు నకిలీ దాడులను ఏర్పాటు చేసి భీమా క్లెయిమ్‌లు చేశారని తేలింది.ఈ నలుగురు నిందితులు రుబెన్ తమ్రజియన్ (26), అరాట్ చిర్కినియన్ (39), వాహే మురాద్ఖన్యన్ (32), అల్ఫియా జుకర్మాన్ (39).
వీరు 2010 రోల్స్ రాయిస్ ఘోస్ట్, 2015 మెర్సిడిస్ జీ63 ఏఎంజీ, 2022 మెర్సిడిస్ ఈ350 వంటి ఖరీదైన కార్లపై ఎలుగుబంటి దాడి జరిగిందని నకిలీ క్లెయిమ్‌లు చేసి, మొత్తం 1,41,000 డాలర్లకు పైగా బీమా మొత్తాన్ని పొందాలని ప్రయత్నించారు.
ఈ నలుగురు నిందితులు తమ మొదటి ఫేక్ క్లెయిమ్‌ను 2024 జనవరి 28న చేశారు.వారు తమ రోల్స్ రాయిస్ కారును ఎలుగుబంటి దాడి చేసిందని, ఈ ఘటన ఎలుగుబంట్లు ఎక్కువగా కనిపించే లేక్ ఏరోహెడ్ ప్రాంతంలో జరిగిందని చెప్పారు.ఈ కారుపై ఎలుగుబంటి వెతుకుతున్నట్లు చూపించే సీసీటివి ఫుటేజ్‌ను కూడా వారు సమర్పించారు.
అయితే ఈ ఫుటేజ్‌లోని ‘ఎలుగుబంటి’ మనిషిలా కనిపించడంతో విచారణ అధికారులకు అనుమానం వచ్చింది.
తమ అనుమానాలను నిర్ధారించుకోవడానికి, కాలిఫోర్నియా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ శాఖ నుంచి ఒక జీవశాస్త్రవేత్తను విచారణ అధికారులు పిలిపించారు.ఈ జీవశాస్త్రవేత్త ఈ ఫుటేజ్‌ను పరిశీలించి, ఆ ఎలుగుబంటి నిజానికి ఎలుగుబంటి వేషంలో ఉన్న ఒక వ్యక్తి అని నిర్ధారించారు.అంతేకాకుండా, ఈ ముగ్గురు నిందితులు తమ మూడు బీమా క్లెయిమ్‌లను ఒకే రోజు, ఒకే ప్రదేశం నుంచి చేశారని, ఈ క్లెయిమ్‌లకు మద్దతుగా ఉపయోగించిన వీడియో క్లిప్‌లు చాలా పోలి ఉండటం విచారణ అధికారుల అనుమానాలను మరింత పెంచింది.
తర్వాత సెర్చ్ వారెంట్స్ తీసుకొని నిందితుల ఇళ్లల్లో సోదాలు చేశారు అప్పుడు వారికి ఒక ఎలుగుబంటి కాస్ట్యూమ్ కనిపించింది.ఈ కాస్ట్యూమ్ తొడుక్కొనే ఆ నలుగురు ఏకంగా ఒక కోటి 20 లక్షలు క్లెయిమ్ చేశారు.
ఈ కేసును శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం దర్యాప్తు చేస్తుంది.నిందితులపై బీమా మోసం, కుట్ర చేసిన కేసులు నమోదు చేయబడ్డాయి.
వీరందరినీ వివిధ బెయిల్ మొత్తాలతో జైలులో ఉంచారు.ఈ విచారణలో గ్లెండేల్ పోలీస్ శాఖ, కాలిఫోర్నియా హైవే పోలీస్ శాఖలు కూడా పాల్గొన్నాయి.