రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో అనుమతులు లేకుండా, చెరువు శిఖాన్ని ఆక్రమించుకుని నిర్మించిన భవనాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూల్చివేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.తెట్టెకుంటలోని సర్వే నెంబర్ 5లో చేపట్టిన అనుమతిలేని నిర్మాణాన్ని ముందే గుర్తించి పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ యజమాని పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగించారని తెలిపారు.
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఈ నిర్మాణం శిఖం పరిధిలోకి వస్తుందని నిర్దారించి తొలగింపునకు ఆదేశించారని వివరించారు.దీంతో శనివారం మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించారన్నారు.
గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు సరైన అనుమతులు లేకుండా గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోరారు.ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాల విషయంలో సంబంధిత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.ఆన్లైన్లో నిర్మాణ అనుమతులు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్లో అందిస్తున్నామని తెలిపారు.
నిర్మాణదారులు స్వయంగా గాని మీసేవ కేంద్రాల్లో గాని సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, నివాసగృహాలకు 15 రోజుల్లో, నివాసీతర నిర్మాణాలకు 30 రోజుల్లో ఆన్లైన్ లోనే అనుమతి పత్రాలు జారీ చేస్తారని ఆయన వివరించారు.అనుమతుల జారీలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత మండల పంచాయతీ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.