తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా నిత్యం ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.ఇప్పటివరకు టీఆర్ఎస్ బారి నుంచి తమ పార్టీ నాయకులను కాపాడుకునేందుకు మిగతా పార్టీలు ఏ విధంగా అయితే జాగ్రత్తపడ్డాయో అదే పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ కు వచ్చింది.
బీజేపీ అధిష్టానం తెలంగాణాలో బలపడేందుకు కాచుకుని కూర్చోవడంతో పాటు టీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలనే పట్టుదలతో ఉంది.ఇదే సమయంలో తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని మరింత బలపడాలని చూస్తోంది.
గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్, టీడీపీ అనే బేధం లేకుండా అన్ని పార్టీల నుంచి నేతలను చేర్చేసుకున్నారు.దాని ప్రభావంతో కారు పార్టీలో ఓవర్ లోడ్ ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు ఆ ఫలితం టీఆర్ఎస్ అనుభవిస్తోంది.

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవ్వడంతో టీఆర్ఎస్ లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నలుగురు గులాబీ టికెట్లు కావాలని పోటీపడుతున్నారు.దీనిలో టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన వారు కొంతమంది అయితే ముందు నుంచి ఉన్నవారు మరికొందరు.అందుకే వీరందిరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో టీఆర్ఎస్ పెద్దలు తర్జనభర్జన పడిపోతున్నారట.ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

వివాద పదవులు, టికెట్లు ఆశ చూపించి ఇతర పార్టీల నుంచిపెద్ద ఎత్తున కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వచ్చి చేరారు.ఇప్పుడు వారిని కాదన లేని పరిస్థితి వచ్చిపడింది.అలా అని ఆదినుంచి టిఆర్ఎస్ ను నమ్ముకున్ననేతలకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితిని కేటీఆర్ ఎదుర్కొంటున్నారు.తాజాగా సిరిసిల్ల లో పర్యటించిన కేటీఆర్ మున్సిపాలిటీ లో టికెట్ల విషయంపై సర్వే చేయిస్తామని, ఆ సర్వే ప్రకారం గెలిచే వారికే టికెట్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇదే సమయంలో రంగంలోకి దిగిన బీజేపీ టికెట్లు దక్కవు అనే వారిని గుర్తించి వారికి టికెట్లు కేటాయిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు.టీఆర్ఎస్ లోని అసంతృప్తులు, టికెట్లు రాని వారిని లక్ష్యంగా చేసుకొని టికెట్లు ఇచ్చి వారి బలంతోనే టీఆర్ఎస్ ను ఓడించడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది.