మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ నిన్న అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో అమెరికా అధికారులు, భారతీయ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.
పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధాని ఐదు దిగ్గజ కంపెనీలు అయిన క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్‌స్టోన్ సీఈవోలతో చర్చలు నిర్వహించారు.ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ యోషిహిదే సుగాతో భేటీ అయ్యారు.
ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సుగాతో మోదీ చర్చించారు.ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.
ఆ వెంటనే వైట్‌హౌస్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికా యంత్రాంగానికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు.అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చరిత్రాత్మకమని ఆయన అన్నారు.
భారత్- అమెరికా సహజ భాగస్వాములు అని .రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని, ఒకే రకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని మోడీ గుర్తుచేశారు.ఇక ఈరోజు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో తొలిసారి ప్రధాని మోడీ భేటీకానున్నారు.

ఇకపోతే ఈసారి మోడీ పర్యటనలో రెండు ప్రత్యేకతలు వున్నాయి.ఒకటి తొలిసారిగా ఎయిండియా వన్ విమానంలో ఆయన ప్రయాణం కాగా, రెండోది బిలియర్డ్ హోటల్‌లో బస.అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో వున్న ఈ హోటల్ దాదాపు 204 ఏళ్ల నాటిది.1816లో దీనిని నిర్మించగా.మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా ఇప్పటి వరకూ ఎన్నో మార్పులు చేశారు.
అమెరికా సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ హోటల్ ఇంటీరియర్ ఉంటుంది.అమెరికా పర్యటనకు వచ్చే దేశాధినేతలు సాధారణంగా ఇదే హోటల్‌లో బస చేస్తుంటారు.
దీంతో ఈ హోటల్ దగ్గర ఎప్పుడూ భద్రతా బలగాలు పహారా కాస్తుంటాయి.