సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్ గత కొంతకాలంగా అప్రదిష్టపాలు అవుతోంది.యూరప్ లో చిన్నారుల క్రయవిక్రయాలకు ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ అడ్డాగా మారిందని ప్రపంచవ్యాప్తంగా కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది ఫేస్‌బుక్ సంస్థ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చాలామంది దుయ్యబడుతున్నారు.సమాజభద్రతకు విఘాతమయ్యే సత్యాలు, విద్వేషాలు, నేరపూరిత పోకడలను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్ పూర్తిగా విఫలమైనట్లు అంతర్గత పరిశోధనలే ఘోషిస్తున్నాయి.
ఈ కథనాలు దాని అనుబంధ సంస్థలైన వాట్సాప్, ఇన్‌స్టాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.దాంతో ఫేస్‌బుక్ యాజమాన్యం నెగిటివ్ కథనాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ముఖ్యంగా పేరు మారిస్తే చాలావరకూ తమ యూజర్ల సంఖ్యను కాపాడుకోవచ్చని భావిస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఫేస్‌బుక్ వార్షికోత్సవంలో కొత్త పేరును పరిచయం చేసింది.ఫేస్‌బుక్ కంపెనీ కొత్త పేరు ‘మెటా’ అని మార్క్ జుకర్‌బర్గ్ గురువారం వెల్లడించారు.దాంతో ఇప్పటివరకు చెడ్డపేరు మూటగట్టుకున్న ఫేస్‌బుక్ అనే మాతృ సంస్థ పేరు కనుమరుగై మెటా అనే పేరే ఎక్కువగా వినిపించవచ్చని చెప్పవచ్చు.
ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారినప్పటికీ ఫేస్‌బుక్ యాప్/సైట్ పేరు మాత్రం అలాగే కొనసాగుతుంది.వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలకు మాతృ సంస్థగా ఉండనున్న మెటా అనేక భవిష్యత్తు లక్ష్యాలకు సూచికగా నిలుస్తుందని జుకర్‌బర్గ్ చెబుతున్నారు.
భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు మరిన్ని సంస్థలు ఫేస్‌బుక్‌లో భాగస్వామ్యం కానున్నాయి.వాటన్నిటికీ ఫేస్‌బుక్ అనే పేరుతో అనుసంధానం చేయడం నచ్చక మెటా అనే పేరును జుకర్‌బర్గ్ తీసుకొచ్చారు.
డిజిటల్ రియాల్టీ అయిన మెటావర్స్‌లోని చిన్న పేరే ‘మెటా’.ఇప్పుడు ఇది ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరుగా మారిపోయింది.
భవిష్యత్తులో వర్చువల్ విధానంలో ప్రజలు సమావేశమై అనేక విషయాల గురించి చర్చించేందుకు వీలుగా మెటా కంపెనీ వర్చువల్ రియాలిటీ సాంకేతికతను పరిచయం చేయబోతోంది.ఈ మెటావర్స్‌లోనే ఆగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఆన్‌లైన్ గేమింగ్ తదితర అద్భుతమైన సాంకేతికతలు ఉండనున్నాయి.
తాము తీసుకు రాబోతున్న మెటావర్స్ టెక్నాలజీ మొబైల్ ఇంటర్నెట్‌ను శాసిస్తుందని జుకర్‌బర్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు.