తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఉచితంగా ఇస్తున్న బతుకమ్మ చీరలపై మహిళల నుంచి తీవ్ర నిరసన వచ్చింది.బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు ఇలాంటి చీరలను అడుక్కునే వారు కూడా ధరించరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా కొన్ని చోట్ల అయితే బతుకమ్మ చీరలను తగలబెడుతున్న మహిళలు కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.
తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం లో బతుకమ్మ చీరలను మహిళలు నిప్పు పెట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో నడిరోడ్డుపై బతుకమ్మ చీరలను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
రోజువారి కూలి పని చేసుకున్నప్పటికీ తాము మంచి చీరలు కట్టుకుంటామని, కానీ పండుగకు ఇటువంటి నాసిరకం చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.తెలంగాణ మహిళలను కెసిఆర్ తన అహంకారంతో అగౌరవ పరుస్తున్నారు అని, మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి పండుగ చేసుకోమని చెబుతున్నారని ఈ వీడియోను సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ షేర్ చేసింది.

ఇక ఈ వీడియోను తెలంగాణ సీఎంఓ కు , టీఆర్ఎస్ పార్టీకి ట్యాగ్ చేసి బతుకమ్మ చీరల పేరుతో మీరు చేస్తున్న నిర్వాకం ఇది అని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.ఇదిలా ఉంటే ఇప్పటికే బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ చీరలు నచ్చకపోతే తీసుకోవద్దని, ఒకవేళ ఎవరైనా బతుకమ్మ చీరలు తీసుకొని వాటిని తగలబెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.బతుకమ్మ చీరలు నచ్చలేదని తీసుకోని వారు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా తీసుకోకుండా ఉండాలని, ఆసరా పెన్షన్ లు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు తీసుకోకూడదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.