కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడోకి చెందిన లిబరల్స్ పార్టీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.అయితే, ఈసారి ఎన్నికల బరిలో 49 మంది భారతీయ సంతతి వ్యక్తులు పోటీపడగా.
వీరిలో 18 మంది విజయం సాధించారు.విజేతలుగా నిలిచిన వారిలో ట్రూడో క్యాబినెట్‌లోని ముగ్గురు సిట్టింగ్ మంత్రులు ఉన్నారు.
రక్షణ మంత్రి హర్జీత్ ఎస్ సజ్జన్ వాంకోవర్ సౌత్ నుంచి మరోసారి ఎన్నికయ్యారు.ప్రజా సేవల విభాగం మంత్రి అనితా ఆనంద్ ఒంటారియోలోని ఓక్‌విల్లే నుంచి గెలుపొందగా.
మరో మంత్రి బర్డిశ్ ఛాగర్ వాటర్లూ నుంచి విజయం సాధించారు.
ఇక న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత జగ్మీత్ సింగ్ బర్న్‌బై సౌత్ నుంచి పోటీచేసి 38 శాతం ఓట్లు సాధించారు.ఎన్‌డీపీ పార్టీ 2019 ఎన్నికల్లో సాధించిన 15.98 % ఓట్ల నుంచి 17.7% కి తన బలాన్ని పెంచుకుంది.అయితే, హౌస్ ఆఫ్ కామన్స్‌లో దాని బలం 24 నుంచి 25కి మాత్రమే పెరిగింది.
కానీ, నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్డీపీ.మళ్లీ కింగ్ మేకర్‌గా అవతరించింది.
ట్రూడో పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించకపోవడంతో మిత్రపక్షమైన ఎన్డీపీపై ఆధారపడక తప్పని పరిస్థితి.

మరోవైపు జగ్మీత్ సింగ్ విజయాన్ని పురస్కరించుకుని పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలోని ఆయన స్వగ్రామం తిక్రీవాలా వాసులు బుధవారం సంబరాలు జరుపుకున్నారు.స్థానిక గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం స్థానికులు మిఠాయిలు పంచుకున్నారు.జగ్మీత్ సాధించిన విజయం పట్ల తమకు గర్వంగా వుందని.
అతను తిక్రీవాలా గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలిపాడని బర్నాలా జిల్లా ట్రెజరీ ఆఫీసర్ బల్వంత్ సింగ్ భుల్లార్ హర్షం వ్యక్తం చేశారు.

బ్రిటీష్ హయాంలో రాచరిక రాష్ట్రాల్లో స్వపరిపాలన కోసం ఏర్పాటైన ప్రజా మండల్ వ్యవస్ధాపకుడు సేవా సింగ్ తిక్రీవాలా, జగ్మీత్ ముత్తాత కెప్టెన్ హీరా సింగ్ అన్నదమ్ములు.సేవాసింగ్ 1935లో నిరాహార దీక్ష సమయంలో పటియాల పాలకుల తప్పుడు ఆరోపణలతో దొంగతనం కేసులో జైలుపాలయ్యారు.జగ్మీత్ సింగ్ ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు.1993లో ఆర్మీ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన తాత షంషేర్ సింగ్ జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జగ్మీత్ కుటుంబం నిర్మించింది.