తొలి దశ కరోనాను అద్భుతంగా ఎదుర్కొని ప్రపంచదేశాల నీరాజనాలు అందుకున్న ఆస్ట్రేలియా సెకండ్ వేవ్‌లో.అది కూడా డెల్టా వేరియంట్‌ను అదుపు చేయలేకపోతోంది.
నెలల తరబడి దేశాన్ని లాక్‌డౌన్‌లో వుంచుతున్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితం కనిపించడం లేదు.ప్రజలు సైతం ప్రభుత్వ నిర్ణయాల పట్ల విసుగెత్తి పోతున్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసి తమకు స్వేచ్ఛను ప్రసాదించాలని కోరుతూ వీధుల్లోకి వస్తున్నారు.సెకండ్ వేవ్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో వెయ్యి కేసులు నమోదు కావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉలిక్కిపడింది.
ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద నగరం సిడ్నీలో తీవ్రత అధికంగా వుంది.వైరస్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటంతో దవాఖానాలుకిటకిటలాడుతున్నాయి.
రోగుల తాకిడిని తట్టుకోవడంతో పాటు అత్యవసర వైద్యం అందించేందుకు వీలుగా ఆస్పత్రుల బయట టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
అటు ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో సైతం కేసుల తీవ్రత ఎక్కువగా వుండటంతో వరుసగా ఆరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు.
మెల్‌బోర్న్‌తో పాటు చుట్టుపక్కల వున్న విక్టోరియా రాష్ట్రంలో వున్న దాదాపు 7 మిలియన్ల మందికి గురువారం నాలుగు వారాల లాక్‌డౌన్ నుంచి విముక్తి లభించాల్సి వుంది.అయితే రాత్రికి రాత్రి కరోనా కేసుల సంఖ్య 92కి పెరగడంతో ఇప్పట్లో లాక్‌డౌన్ ఎత్తివేత కుదరదని విక్టోరియా ప్రీమియర్ డాన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు.
మన చుట్టూ ఇంకా కేసులు వున్నాయని.లాక్‌డౌన్ సమయంలో ఎన్ని గంటలకు బయటకు అనుమతిస్తారనే దానిపై అధికారులు వివరాలు తెలియజేస్తారని ఆండ్రూస్ చెప్పారు.
మరోవైపు న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం, సిడ్నీలలో ఆదివారం కొత్తగా 1,218 కొత్త కేసులు నమోదయ్యాయి.ఇది దేశంలో రోజువారీ కేసుల్లో అత్యధిక గరిష్ట స్థాయి.
జూన్ మధ్యలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 8 మిలియన్ల మంది వున్న న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో మొత్తం 19000 కేసులు కనుగొన్నారు.
అయితే వైరస్‌ను కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు పెద్ద పీట వేసింది.
దీంతో ఇక్కడ టీకా రేటు పెరుగుతోంది.అక్టోబర్ నాటికి 70 శాతం మంది వయోజనులకు వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు సుదీర్ఘ ఆంక్షలతో అలసిపోయిన ప్రజలకు ప్రభుత్వం స్వల్ప ఊరటను ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీని ప్రకారం హాట్ స్పాట్ కానీ ప్రాంతాలలో , పూర్తిగా టీకాలు తీసుకున్న ఐదుగురు పెద్దలు సెప్టెంబర్ నెల మధ్య నుంచి ఒక గంట వరకు బయట గుమిగూడవచ్చని అధికారులు తెలిపారు.అలాగే చిన్న తరహా వివాహాలకు కూడా అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగం పరిశీలిస్తోంది.ప్రతి రాష్ట్రం, భూభాగంలో 70 నుంచి 80 శాతం టీకా లక్ష్యాలను చేరుకున్న తర్వాత దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తామని ప్రధాని స్కాట్ మోరిసన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.కోవిడ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 51000 కేసులు నమోదవ్వగా.1000 మంది ప్రాణాలు కోల్పోయారు.