హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.కేసులో అరెస్ట్ చేసిన నిందితులు బాలాజీ, వెంకట్ రత్నారెడ్డి, మురళీలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా నిందితుల నుంచి కొకైన్ 2.8 గ్రాములు, ఎల్ఎస్డీ 6 బ్లాడ్స్, పిల్స్ 25, గంజాయి రెండు ప్యాకెట్లు, రెండు కార్లు, ఐదు సెల్ ఫోన్లతో పాటు రూ.72 వేల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడు బాలాజీ గతంలో నేవీలో ఉద్యోగం చేసేవాడని గుర్తించిన పోలీసులు తరచూ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో పార్టీలు నిర్వహించినట్లు తెలిపారు.
హైదరాబాద్, బెంగళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్లతో పాటు నైజీరియన్లతో బాలాజీకి నేరుగా సంబంధాలు ఉన్నాయని నిర్ధారించారు.ఈ క్రమంలోనే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
నలుగురు వ్యక్తుల నుంచి తరచూ బాలాజీ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారని పేర్కొన్నారు.అదేవిధంగా సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు డ్రగ్స్ అలవాటు ఉందని, ఈ పార్టీల్లో అమ్మాయిలను సైతం వెంకట్ సప్లై చేశారని పోలీసులు తెలిపారు.
మొత్తం డ్రగ్స్ వ్యవహారంలో నలుగురు డ్రగ్ సప్లయర్లతో పాటు ముగ్గురు నైజీరియన్లు, మరో 18 కన్జూమర్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.