అంతా ఊహించినట్లుగానే కర్ణాటకలో కాంగ్రెస్ ( Congress ) జెండా ఎగిరింది.బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించడంలో అక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్ధి రామయ్యలు గట్టిగానే కష్టపడ్డారు.కర్ణాటక కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలోనే సనిగ్ధం నెలకొంది.
ముఖ్యంగా డీకే శివకుమార్ సిద్ధిరామయ్య లో ఒకరికి అవకాశం దక్కనుంది.దీంతో ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈరోజు సాయంత్రం బెంగళూరులో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఇద్దరిలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే విషయంపైనే చర్చించనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం లో ఆ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన డీకే శివకుమార్( DK Sivakumar ) కృషి చెప్పలేనిది.2017 వరకు ఓ సాధారణ నాయకుడిగానే శివకుమార్ ఉన్నారు.ఆ ఏడాది ఆగస్టులో గుజరాత్ కు చెందిన అహ్మద్ పటేల్ రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేలకు బెంగళూరులో విడిది ఏర్పాటు చేసి అధిష్టానం దగ్గర గుర్తింపు పొందారు.ఇక ఆ సమయంలోనే అక్రమ నగదును బదిలీ చేస్తున్నారని ఈడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.
అదే కేసులో తీహార్ జైలుకు శివకుమార్ వెళ్లారు.
డీకే పై కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకం కుదరడంతో ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు.ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి సైతం ఆయనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది .ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 1.20 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో శివకుమార్ గెలిచారు.కాంగ్రెస్ కీలక నేతలైన రాహుల్ గాంధీ సోనియా గాంధీల ఆశీస్సులు ఆయనకు ఉండడంతో పాటు, ఆర్థికంగా బలమైన నేతగా శివకుమార్ ఉన్నారు.
ఇక సిద్ధ రామయ్య( Siddharamaiah ) విషయానికి వస్తే , రాజకీయాల్లో సీనియర్ నేత.
ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధి రామయ్య ఇప్పటివరకు 13 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.2013లో కాంగ్రెస్ కు 122 స్థానాలను అందించడంలో సిద్ధ రామయ్య కీలకపాత్ర పోషించారు.అదే నమ్మకంతో ఆయనకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది.
ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వనన్ని పథకాలను అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు.పార్టీని , ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో సిద్ధిరామయ్య సిద్ధహస్తులు .దీంతో ఇప్పుడు సిద్ధిరామయ్య , డికే శివకుమార్ లలో ఎవరికీ అవకాశం దక్కబోతుందనేది నేడు తేలిపోనుంది.